YouVersion Logo
Search Icon

ప్రకటన 17

17
1ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. –నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను; 2భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. 3అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని,#17:3 లేక, దేవదూషణతో నిండుకొనిన నామములు (గలదై). యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని. 4ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేతపట్టుకొనియుండెను. 5దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను–మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను. 6మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా 7ఆ దూత నాతో ఇట్లనెను–నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములునుగలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. 8నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు. 9ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు; 10మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను. 11ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితోపాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును. 12నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు. 13వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. 14వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభు వులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును. 15మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను – ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడువారిని సూచించును. 16నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. 17దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. 18మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ప్రకటన 17