రోమా 2
2
1కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? 2అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 3అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా? 4లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. 6ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. 7సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. 8-9అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యముచేయు ప్రతిమనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. 10సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. 11-12దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. 13ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 14ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. 16దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.
17నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 18ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేప్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా? 19జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి –నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 20చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 21ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 22వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? 23ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా? 24వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనులమధ్యను దూషింపబడు చున్నది? 25నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 26కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనినయెడల అతడు సున్నతి లేనివాడైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? 27మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్న తియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 28బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. 29అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.
Currently Selected:
రోమా 2: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.