YouVersion Logo
Search Icon

రోమా 5

5
1కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము#5:1 కొన్ని ప్రాచీనప్రతులలో–కలిగియున్నాము అని పాఠాంతరము. 2మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము. 3-4అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను#5:3-4 శీలము. కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడు దము. 5ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. 6ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. 7నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. 8అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. 9కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. 10ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. 11అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.
12ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.#5:12 మూలభాషలో–అందరిద్వారా వ్యాపించెను. 13ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 14అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషేవరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను, 15అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను. 16మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 17మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. 18కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. 19ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 20-21మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

Currently Selected:

రోమా 5: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for రోమా 5