రూతు 1
1
1న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్లెను. 2ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. 3నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి. 4వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు. 5వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను. 6వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. 7అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లుచుండగా 8నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి –మీరు మీ తల్లులయిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక; 9మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. 10అంతట వారు ఎలుగెత్తి యేడ్చి–నీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా 11నయోమి–నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా? 12నా కుమార్తెలారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను 13వారు పెద్ద వారగువరకు వారికొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలైయుందురా? నా కుమార్తెలారా, అదికూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. 14వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తు కొనెను. ఇట్లుండగా 15ఆమె–ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను. 16అందుకు రూతు–నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; 17నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. 18తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి. 19వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి–ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా 20ఆమె–సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి#1:20 మధురము. అనక మారా#1:20 చేదు. అనుడి. 21నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అనిపిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. 22అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.
Currently Selected:
రూతు 1: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.