YouVersion Logo
Search Icon

రూతు 3

3
1ఆమె అత్తయైన నయోమి–నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. 2ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు. 3నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము. 4అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా 5ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి 6ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. 7బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను. 8మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను. 9అతడు–నీ వెవరవని అడుగగా ఆమె– నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమనగా 10అతడు–నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినేగాని గొప్పవారినేగాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీమునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది. 11కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు. 12నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు. 13ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను. 14కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు–ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. 15మరియు అతడు–నీవు వేసికొనిన దుప్పటి తెచ్చిపట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరు కొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను. 16ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్త–నా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి 17–నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చెననెను. 18అప్పుడు ఆమె–నా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియువరకు ఊరకుండుమనెను.

Currently Selected:

రూతు 3: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in