YouVersion Logo
Search Icon

1 తిమోతి పత్రిక 6

6
క్రీస్తు మంచి సేవకుని క్రియలు
1బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి. 2విశ్వాసులైన యజమానులు గల బానిసలైతే ఆ యజమానులు తమ సోదరులే కదా అని వారిని చిన్న చూపు చూడక, తాము సేవించేది తమ ప్రేమ పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.
3ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.
6అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
11దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. 13అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా 14నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.
15భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.
17ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.
20తిమోతీ, ప్రభువు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ భక్తిలేని మాటలకూ, మూర్ఖపు వాదాలకూ దూరంగా ఉండు. కొందరు వాటిని జ్ఞానం అనుకుంటారు 21కొందరు వాటిని మనఃపూర్వకంగా విశ్వసించి విశ్వాసం విషయంలో తప్పిపోయారు.
కృప మీకు తోడై ఉండు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in