YouVersion Logo
Search Icon

2 తిమోతి పత్రిక 1

1
అపొస్తలుని అభివందనాలు
1క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం. 2తండ్రియైన దేవుని నుండీ మన ప్రభువు క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
3నా ప్రార్థనల్లో నిన్ను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నా పూర్వీకులవలే కల్మషంలేని మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 4నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను. 5నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.
6ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను. 7దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు. 8కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.
9ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. 10ఆ కృప ఇప్పుడు క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడి అయింది. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనూ సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు. 11ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.
12ఆ కారణం చేత నేనీ కష్టాలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినవాడు నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదాన్ని రాబోతున్న ఆ రోజు వరకూ ఆయన కాపాడగలడని నాకు పూర్తి నమ్మకం ఉంది. 13క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు. 14దేవుడు నీకు అప్పగించిన ఆ మంచిదాన్ని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.
15ఆసియలోని వారంతా నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. ఫుగెల్లు, హెర్మొగెనే అలాటివారే. 16ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక. 17అతడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు. 18పైగా అతడు ఎఫెసులో నాకు ఎంత ఉపచారం చేశాడో నీకు బాగా తెలుసు. ఆ దినాన అతడు ప్రభువు వలన కనికరం పొందేలా ప్రభువు అనుగ్రహించు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in