YouVersion Logo
Search Icon

2 సమూ 1

1
సౌలు మరణ వార్త దావీదు వినడం
1:4-12; 1సమూ 31:1-13; 1దిన 10:1-12
1దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు. 2మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు. 3అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను” అన్నాడు. 4“జరిగిన సంగతులు నాతో చెప్పు” అని దావీదు అడిగాడు. అందుకు అతడు “సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు” అన్నాడు.
5“సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు” అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, 6“నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు. 7రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘చిత్తం నా రాజా’ అన్నాను. 8అతడు ‘నువ్వు ఎవరివి?’ అని నన్ను అడిగాడు. ‘నేను అమాలేకీయుణ్ణి’ అని చెప్పాను. 9అతడు ‘నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి’ అని ఆజ్ఞాపించాడు.
10అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను” అన్నాడు. 11దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి, 12సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.
13తరువాత దావీదు “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు “నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును” అన్నాడు. 14అందుకు దావీదు “భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?” అని 15తన మనిషి ఒకణ్ణి పిలిచి “వెళ్లి వాణ్ణి చంపు” అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు. 16“యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి” అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు.
సౌలు, యోనాతానుల మరణ వార్త గురించి దావీదు విలాపం
17దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు. 18యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది.
19ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా
నీ పర్వతాలపై మృతి చెందింది.
బలవంతులు ఎలా పడిపోయారో గదా!
20ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు.
సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు.
అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి.
అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.
21గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక.
అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక.
పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది.
సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.
22హతుల రక్తం ఒలికించకుండా,
బలిష్టుల దేహాలనుండి
యోనాతాను విల్లు మడమ తిప్పలేదు.
ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు.
23సౌలూ యోనాతానూ తమ బతుకులో
ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు.
తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు.
వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు.
సింహాలకంటే బలమైన వారు.
24ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి.
అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు.
మీకు బంగారు నగలు ఇచ్చాడు.
25యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు.
నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు.
26నా సోదరుడా, యోనాతానూ,
నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి.
నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను.
నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది.
స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది.
27అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు.
యుద్ధ శూరులు నశించిపోయారు.

Currently Selected:

2 సమూ 1: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in