YouVersion Logo
Search Icon

గలతీ పత్రిక 5

5
ఉపమానం వివరణ
1స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
2మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను. 3సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. 4మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు. 5మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. 6యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
7మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? 8ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు. 9పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
10మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. 11సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
12మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది. 13సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. 14ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
పవిత్రీకరణ ఆత్మ ద్వారానే, ధర్మశాస్త్రం ద్వారా కాదు
16నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
18ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
క్రీస్తులో నూతన జీవం బహిర్గతం కావడం
25మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in