YouVersion Logo
Search Icon

గలతీ పత్రిక 6

6
సోదరభావంతో కూడిన నూతన జీవితం
1సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
3ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? 6వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి. 7మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
8ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
11నా సొంత దస్తూరీతో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి. 12శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరే వారు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. 13అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
14అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. 15కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
16ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక. 17నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. 18సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్‌.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in