YouVersion Logo
Search Icon

మీకా 6

6
దేవుని ఫిర్యాదు
1యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి.
మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు,
లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు.
నీ స్వరం కొండలు వినాలి.
2పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు
యెహోవా చేసిన ఫిర్యాదు వినండి.
ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.
3నా ప్రజలారా, నేను మీకేం చేశాను?
మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి.
4ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను.
బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను.
మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.
5నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన,
బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి.
యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా
షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి.
6యెహోవాకు నేనేం తీసుకురాను?
మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను?
దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?
7వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా?
నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా?
నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?
8మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.
ఆయన నిన్ను కోరేదేంటంటే,
న్యాయంగా ప్రవర్తించు.
కనికరాన్ని ప్రేమించు.
వినయంగా నీ దేవునితో నడువు.
ఇశ్రాయేలీయుల దుర్నీతి క్రియలు
9వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు,
ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది.
“బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి.
10దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది.
అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.
11తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?
12ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.
అక్కడి ప్రజలు అబద్దికులు.
వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.
13కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను.
నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.
14నువ్వు తింటావు కానీ తృప్తి పడవు.
నీలోపల వెలితిగానే ఉంటుంది.
నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు.
నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను.
15నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు.
నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు
కానీ ఆ నూనె పూసుకోవు.
ద్రాక్షపళ్ళను తొక్కుతావు
కానీ ద్రాక్షారసం తాగవు.
16ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు.
అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు.
వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు.
కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను.
దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను.
నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”

Currently Selected:

మీకా 6: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in