YouVersion Logo
Search Icon

మీకా 7

7
ఇశ్రాయేలు కష్టాలు
1నాకెంతో బాధగా ఉంది!
వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత,
ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది.
పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు.
అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను.
2భక్తులు దేశంలో లేకుండా పోయారు.
ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు.
హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు.
ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.
3వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి.
అధికారి డబ్బులు అడుగుతాడు.
న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు.
గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు.
ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.
4వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు.
వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు.
అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు,
మీరు శిక్ష అనుభవించే రోజు.
ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.
5ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు.
ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు.
నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు.
6కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు.
కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు.
తన సొంత ఇంటివారే తన శత్రువులు.
7అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను.
రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను.
నా దేవుడు నా మాట వింటాడు.
ఇశ్రాయేలు తిరిగి లేవడం
8నా పగవాడా, నా మీద అతిశయించవద్దు.
నేను కింద పడినా తిరిగి లేస్తాను.
నేను చీకట్లో కూర్చున్నపుడు
యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.
9నేను యెహోవా దృష్టికి పాపం చేశాను,
కాబట్టి ఆయన నా పక్షాన వాదించి
నా పక్షాన న్యాయం తీర్చే వరకూ
నేను ఆయన కోపాగ్ని సహిస్తాను.
ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు.
ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.
10నా శత్రువు దాన్ని చూస్తాడు.
“నీ యెహోవా దేవుడు ఎక్కడ?”
అని నాతో అన్నది అవమానం పాలవుతుంది.
నా కళ్ళు ఆమెను చూస్తాయి.
వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.
11నీ గోడలు కట్టించే రోజు వస్తుంది.
ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి.
12ఆ రోజు అష్షూరు దేశం నుంచి,
ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి,
ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ
ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు
నీ దగ్గరికి వస్తారు.
13ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన,
వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.
దేవుని క్షమాపణ, ఆయన కనికరం
14నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు.
కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా
పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు.
15ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా
నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.
16రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి.
వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు.
వాళ్ళ చెవులు వినబడవు.
17పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు.
వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు.
భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు.
నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.
18నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.
నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.
నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.
నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.
19నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.
నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.
మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.
20నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.
పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.

Currently Selected:

మీకా 7: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in