YouVersion Logo
Search Icon

సామెత 27

27
1రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?
2నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.
3రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.
4క్రోధం క్రూరమైనది. కోపం వరదలాగా ముంచెత్తుతుంది. రోషం ఎదుట నిలవ గలిగేది ఎవరు?
5లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
6స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
7కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.
8తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.
9పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.
10నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.
11కుమారా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాటలాడతాను.
12బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. జ్ఞానం లేనివారు నిర్లక్ష్యంగా ఆపదలో పడతారు.
13ఎదుటి మనిషి విషయంలో హామీ ఉండే వాడి నుంచి అతని వస్త్రం తీసుకో. ఇతరుల కోసం పూచీ తీసుకున్న వాడిచేత వాడి వస్తువులు తాకట్టు పెట్టించు.
14పొద్దున్నే లేచి పెద్ద గొంతుకతో తన స్నేహితుణ్ణి దీవించే వాడి దీవెన అతని పాలిట శాపమే.
15ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.
16ఆమెను ఆపాలని ప్రయత్నించేవాడు గాలిని ఆపాలని ప్రయత్నించే వాడితో సమానం. తన కుడిచేతిలో నూనె పట్టుకోవాలని ప్రయత్నించడంతో సమానం.
17ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.
18అంజూరు చెట్టు పెంచేవాడు దాని పండ్లు తింటాడు. తన యజమానిని గౌరవించే వాడు ఘనత పొందుతాడు.
19నీటిలో ముఖానికి ముఖం కనబడినట్టు ఒకడి మనస్సుకు మరొకడి మనస్సు కనబడుతుంది.
20పాతాళానికి, అగాధానికి తృప్తి ఉండదు. అలానే మనిషి కోరికలకు#27:20 కోరికలకు కళ్ళు ఎప్పటికీ తృప్తి ఉండదు.
21మూసతో వెండిని కొలిమితో బంగారాన్ని తాను పొందిన కీర్తితో మనిషిని పరీక్షించి చూడ వచ్చు.
22మూర్ఖుడిని గోదుమలలోబాటు రోకలితో దంచినా వాడి మూఢత వాణ్ణి వదలిపోదు.
23నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.
24డబ్బు శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉంటుందా?
25ఎండిన గడ్డి వామి వేస్తారు. పచ్చిక ఇక కనిపించడం లేదు. మొలకలు వస్తున్నాయి. ఆలమందల కోసం కొండగడ్డి కోసుకొస్తున్నారు.
26నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి.
27నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.

Currently Selected:

సామెత 27: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in