YouVersion Logo
Search Icon

కీర్తన 145

145
దావీదు రాసిన స్తుతి కీర్తన
1నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను.
2అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను.
3యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.
4ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు.
5వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.
6వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను.
7నువ్వు కనపరిచే కరుణ ఉన్నతిని వాళ్ళు చాటిస్తారు. నీ నీతి క్రియలను వాళ్ళు ఆలపిస్తారు.
8యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.
9యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.
10యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నువ్వు స్తుతి ప్రశంసలకు పాత్రుడవు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.
11నీ భక్తులు నీ రాజ్యవైభవాన్ని గురించి, నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు.
12మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.
13నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.
14కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.
15జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.
16నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
17యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.
18ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.
19తన భక్తుల కోరికలు ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను కాపాడతాడు.
20తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు.
21నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in