YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 6

6
1తరువాత సొలొమోను యిలా అన్నాడు:
“యెహోవా, నల్లని మేఘంలో
నివసిస్తానని అన్నాడు.
2ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం.
శాశ్వతంగా నీవు నివసించటానికి అది నిలయం!”
సొలొమోను ప్రసంగం
3సొలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడిఉన్న ప్రజలందరనీ దీవించాడు. 4సొలొమోను యీలా అన్నాడు:
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి! నా తండ్రి దావీదుకు తానేమి చేస్తానని వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవేర్చినాడు. యెహోవా దేవుడు యిలా చెప్పియున్నాడు: 5‘నా ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు. 6కాని ఇప్పుడు నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. పైగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి దావీదును ఎంపిక చేశాను.’
7“ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రియగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు. 8కాని. యెహోవా నా తండ్రితో, ‘దావీదూ, నీవు నా పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలంచటం బాగానే వుంది. 9కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు. 10యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రి స్థానంలో నేను కొత్త రాజును. దావీదు నా తండ్రి. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన వాగ్దానం. మరి నేను ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు ఒక ఆలయాన్ని నిర్మించాను. 11ఒడంబడిక పెట్టెను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్టెలోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు కొన్నాడు.”
సొలొమోను ప్రార్థన
12సొలొమోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా నిలబడ్డాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజల కెదురుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సొలొమోను తన రెండు చేతులూ చాచాడు. 13సొలొమోను కంచుతో ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర అడుగులు; వెడల్పు ఏడున్నర ఆడుగులు; ఎత్తు ఎడున్నర అడుగులు అతడు దానిని బయట ఆవరణలో మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశమైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. సొలొమోను తన చేతులను ఆకాశంవైపుకు ఎత్తాడు. 14పిమ్మట సొలొమోను యిలా ప్రార్థన చేశాడు:
“ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కడు లేడు. ప్రేమ, కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిలబెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్ణహృదయంతో సన్మార్గులై, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొనసాగిస్తావు. 15నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు. 16ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. నీవిలా మాట యిచ్చావు: ‘దావీదూ, నా సన్నిధిలో ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు తప్పక కొనసాగుతాడు. నీ కుమారులు వారు చేసే కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.’ 17ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.
18“ఓ దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు! 19కానీ నీ కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను ఆలకించు. నా దేవుడైన ప్రభూ, నా మొరాలకించుము! నీ కొరకు నా ప్రార్థనయందు శ్రద్ధ వహించుము. నేను నీ సేవకుడను. 20ఈ ఆలయాన్ని నీవు కన్నులార రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో నీ పేరును ప్రతిష్ఠిస్తావని నీవు చెప్పియున్నావు. ఈ ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు విందువుగాక! 21నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్యముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు మమ్మల్ని మన్నించుము.
22“ఒక మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు నీపేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి వచ్చినప్పుడు 23నీవు ఆకాశంలోని నీ నివాసము నుండి వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను బాధ పెట్టిన విధంగా తానుకూడా ఆ బాధను అనుభవించేలా చేయుము. మంచి కార్యములు చేసిన వాని నిర్దోషిత్వాన్ని నిరూపింపుము.
24“నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ల పాపం చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థస్తూ వేడుకుంటే, 25ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని రమ్ము.
26“వర్షాలు లేకుండ ఆకాశం కుంచుకుపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్లయితే ఇది జరుగుతుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే, 27నీవు ఆకాశంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్షాలు కురిపించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు.
28“ఈ రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోటలకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదాడులు జరిగినప్పుడుగాని, ఇశ్రాయేలులో ఏ రకమైన వ్యాధులు ప్రబలినా, 29ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే, 30నీ నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆలకించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము. ఎందువల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది. 31అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు కలిగి వుంటారు. 32నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే, 33నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలువ బడుతూ వుందని తెలుసుకుంటారు.
34“నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో 35వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.
36“ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు. 37కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు. 38పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ నిన్ను ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు. 39ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము. 40ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.
41“ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో
నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము.
నీ యాజకులు రక్షణ పొందుదురు గాక!
ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
42ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు.
నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపకముంచు కొనుము!”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in