అపొస్తలుల 8
8
1-3అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు.
సౌలు సంఘాన్ని హింసించటం
ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 4ఇలా చెదిరిపోయినవాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.
సమరయలో ఫిలిప్పు
5ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు. 6-7ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టినవాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టినవాళ్ళనుండి దయ్యాలు పెద్ద కేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు. 8ఆ పట్టణంలో ఉన్నవాళ్ళందరూ ఆనందించారు.
9సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలంనుండి మంత్రతంత్రాలు చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్పవాణ్ణని చెప్పుకొనేవాడు. 10చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే, ఆ దైవికమైన శక్తి అతనిలో ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు. 11అతడు వాళ్ళను తన మంత్రతంత్రాలతో చాలాకాలంనుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు. 12కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు. 13సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహత్యాల్ని, అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.
14యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు. 15పేతురు, యోహాను వచ్చి అక్కడివాళ్ళు పవిత్రాత్మను పొందాలని ప్రార్థించారు. 16ఎందుకంటే అక్కడివాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు. 17వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
18అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో, 19“నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
20పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ! 21దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు. 22నీ దుర్బుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు. 23నీలో దుష్టత్వం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అపవిత్రతకు లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
24ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
25పేతురు, యోహాను తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
ఫిలిప్పు ఇతియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం
26ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.
27అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇతియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇతియొపీయుల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, 28తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా,
29దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అతన్ని కలుసుకో” అని అన్నాడు. 30ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.
31“ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. 32ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు:
“చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు
బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా
ఆయన మాట్లాడ లేదు!
33ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు.
ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు.
ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”#యెషయా 53:7-8.
34ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. 35ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.
36ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. 37ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. 38ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. 39వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు. 40ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడినుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.
Currently Selected:
అపొస్తలుల 8: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International