YouVersion Logo
Search Icon

హగ్గయి 1

1
ఇది ఆలయ నిర్మాణానికి సమయం
1దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు). ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. ఈ సందేశమేమంటే, 2సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
3పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది: 4“మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క పలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది. 5అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి! 6నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. అయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’”
7సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి! 8మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు.
9సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే. దానిని మీరు ఇంటికి తెచ్చినప్పుడు, నేను గాలిని పంపించి ఎగురగొడతాను. ఎందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు. 10ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.”
11ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ, జంతువులన్నీ బలహీనమౌతాయి.”
క్రొత్త ఆలయం పని ప్రారంభమవటం
12పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, మరియు యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువయు, మిగిలియున్న ప్రజలును తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తమకు తెలియజేసిన మాటలను విని, దేవుడైన యెహోవాపట్ల భయభక్తులను చూపారు.
13దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు.
14పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులందరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతా వచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. 15వారు ఈ పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు.

Currently Selected:

హగ్గయి 1: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in