హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13
13
చివరి మాటలు
1పరస్పరం సోదరుల్లా జీవించండి. 2తెలియనివాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. 3చెరసాలల్లో ఉన్నవాళ్ళను, మీరు వాళ్ళతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి.
4వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహపాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకొన్నవాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. 5ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్నదానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు:
“నేను నిన్ను ఎన్నటికీ విడువను
నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను.”#ద్వితీ. 31:6.
6అందువల్ల మనం దృఢ విశ్వాసంతో,
“ప్రభువు నా రక్షకుడు,
నాకే భయంలేదు.
మానవుడు నన్నేమి చెయ్యగలడు?”#కీర్తన. 118:6-7.
అని అంటున్నాము.
7మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. 8నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. 9ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.
10యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారంలేదు. 11పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.
17మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.
18మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము. 19నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి.
20శాంతిని స్థాపించే దేవుడు, గొఱ్ఱెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 21ఆ దేవుడు మీరు ఆయన యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
22సోదరులారా! నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగ చేసే ఈ సందేశాన్ని సహృదయంతో చదవమని వేడుకుంటున్నాను. 23మన సోదరుడైన తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియజేస్తున్నాను. అతడు నా వద్దకు త్వరలో వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను.
24మీలోవున్న పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు తెలుపుతున్నారు.
25మీ అందరికి దేవుని ప్రేమానుగ్రహము తోడుగా వుండునుగాక!
Currently Selected:
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International