యిర్మీయా 30
30
ఆశాజనకమైన వాగ్ధానాలు
1ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది. 2ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) వ్రాయాలి. 3ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు.
4యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు. 5యెహోవా చెప్పినది ఇలా ఉంది:
“భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం!
ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!
6“ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము:
ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం!
అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే
తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను?
ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది?
ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!
7“యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం.
ఇది బహు కష్ట కాలం.
ఇటువంటి కాలం మరి ఉండబోదు.
అయినా యాకోబు సంరక్షింపబడతాడు.
8“అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరిచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు. 9ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు#30:9 రాజైన దావీదు ఈ దావీదు మరో ఇశ్రాయేలు రాజు. ఇతను కూడ దావీదు రాజులా ఖ్యాతి చెందిన వాడు వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.
10“కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!”
ఇదే యెహోవా వాక్కు:
“ఇశ్రాయేలూ, భయపడవద్దు!
ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను.
ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు.
మీ సంతతివారిని ఆ దేశంనుండి తిరిగి తీసుకొస్తాను.
యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది.
ప్రజలు యాకోబును బాధ పెట్టరు.
నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు.
11ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!”
ఇదే యెహోవా వాక్కు.
“నేను మిమ్మల్ని రక్షిస్తాను.
నేనే మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను.
కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను.
ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను.
కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను.
అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి.
నేను మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.”
12యెహోవా ఇలా అంటున్నాడు:
“ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది.
మీకు తగిలిన దెబ్బ నయం కానిది.
13మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు.
అందుచేత మీరు స్వస్థపర్చబడరు.
14మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు.
అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు.
మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు.
ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను!
మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను!
మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను.
మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను.
15ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు.
మీ గాయం బాధకరమైనది.
పైగా దానికి చికిత్స లేదు.
ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను.
మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను.
16ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు.
కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి.
ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు!
ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నారు.
కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు.
ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు.
అలాగే యితరులు యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు.
17అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను.
మీ గాయాలన్నీ మాన్పుతాను.” ఇదే యెహోవా వాక్కు,
“ఎందువల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు.
‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”
18యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు.
కాని వారు తిరిగివస్తారు.
యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను.
నగరమంతా#30:18 నగరము నగరమనగా యెరూషలేము కావచ్చును. కాని ఇశ్రాయేలు యూదాలోని నగరాలన్నీ అని కూడా అర్థం కావచ్చు. కూలిపోయిన భవనాలతో
కప్పబడిన కొండలా ఉంది.
కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది.
రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది.
19ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు.
ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి.
వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను.
ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు.
వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను.
ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.
20యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను.
అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను.
21వారి స్వజనులలో ఒకడు వారికి నాయకత్వం వహిస్తాడు.
ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు.
నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు.
అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను.
అతడు నాకు సన్నిహితుడవుతాడు.
22మీరు నా ప్రజలై ఉంటారు.
నేను మీ దేవుడనై ఉంటాను.”
23యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు!
ఆయన ప్రజలను శిక్షించినాడు.
ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది.
ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది.
24తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు
యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు.
ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో)
మీరు అర్థం చేసుకుంటారు.
Currently Selected:
యిర్మీయా 30: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International