సామెతలు 1
1
పరిచయం
1ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. 2ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి. 3ప్రజలు జీవించేందుకు శ్రేష్ఠమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. 4జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు. 5ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగలవారు కూడ జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు. 6అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు.
7ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి, ఆయనకు విధేయత చూపించటమే, నిజమైన తెలివికి మూలము. కాని పాపాన్ని ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు.
సొలొమోను మనకు ఇచ్చిన సలహా
8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ నీవు పాటించాలి. 9నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి.
10నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు. 11ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, ఎవరినైనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం. 12ఎవరైనా ఒక నిర్దోషిమీద మనం దాడి చేద్దాం. మనం అతణ్ణి చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం పంపిద్దాం. అతణ్ణి మనం నాశనం చేసి, సమాధికి పంపిద్దాం. 13చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకొందాం. 14కనుక మాతో వచ్చి, వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచుకొందాం.”
15నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుష్యులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. 16ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు.
17ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు. 18కాని నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు. 19ఇవి దురాశపరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి ప్రాణాంతక మవుతుంది.
మంచి స్త్రీ — జ్ఞానము
20ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. 21రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:
22“మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? 23మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.
24“కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 25నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 26అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. 27గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.
28“ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. 29మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. 30నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. 31కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.
32“అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. 33కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”
Currently Selected:
సామెతలు 1: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International