YouVersion Logo
Search Icon

సామెతలు 15

15
1శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది.
2జ్ఞానముగల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివితక్కువ తనమే అవుతుంది.
3అన్నిచోట్లా జరిగేవాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు.
4దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.
5తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.
6మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి.
7జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు.
8దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.
9దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
10ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.
11మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.
12బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు.
13ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో ఆ దు: ఖం వ్యక్తం అవుతుంది.
14జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కాని బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి.
15కొంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారంగానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది.
16ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.
17ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటంకంటే, ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు.
18త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కాని సహనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు.
19బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కాని నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.
20జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు.
21తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే ఆనందం. కాని జ్ఞానముగలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్తపడతాడు.
22ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు.
23ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది.
24జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.
25గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.
26చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కాని దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.
27ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కాని లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.
28మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.
29యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కాని మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.
30నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.
31ఒక మనిషి తాను తప్పు చేసినప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.
32ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.
33యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవ్వాలి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in