YouVersion Logo
Search Icon

సామెతలు 19

19
1అబద్ధాలు చెప్పి, మోసం చేసే బుద్ధిహీనునిగా ఉండుటకంటే, నిజాయితీగల పేదవానిగా ఉండుట మేలు.
2దేనిగూర్చిగాని ఉద్వేగం పడిపోవటం మాత్రం చాలదు. నీవు చేస్తోంది ఏమిటో కూడా నీకు తెలిసి ఉండాలి. నీవు తొందరపడి ఏదీ చేయకూడదు. లేకపోతే నీవు తప్పు చేస్తావు.
3ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని పాడు చేస్తుంది. కాని అతడు యెహోవాను నిందిస్తాడు.
4ఒకడు ధనవంతుడైతే అతని ఐశ్వర్యం అతనికి అనేకమంది మిత్రులను తెచ్చి పెడ్తుంది. కాని ఒకడు పేదవాడైతే అతని స్నేహితులంతా అతనిని విడిచి పెట్టేస్తారు.
5మరొకనికి విరోధంగా అబద్ధం చెప్పేవాడు శిక్షించబడుతాడు. అబద్ధాలు చెప్పేవాడు క్షేమంగా ఉండడు.
6అధికారులతో అనేకమంది స్నేహంగా ఉండాలని కోరుకొంటారు, కానుకలు ఇచ్చే వానితో ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉండాలని కోరుకొంటారు.
7ఒక మనిషి పేదవాడైతే, అతని కుటుంబం కూడా అతనికి విరోధంగా ఉంటుంది. అతని స్నేహితులంతా అతని దగ్గరనుండి వెళ్లిపోతారు. ఆ పేదవాడు సహాయం కోసం వారిని భిక్షం అడగవచ్చు. కాని వారు అతని దగ్గరకు కూడా వెళ్లరు.
8తెలివిని సంపాదించుకొనుటకు ప్రయత్నించే మనిషి తనను తాను ప్రేమిస్తున్నట్టు సూచిస్తాడు. జ్ఞానమును ప్రేమించేవాడు లాభం పొందుతాడు.
9అబద్ధాలు చెప్పేవాడు శిక్షించబడతాడు. అబద్ధాలు చెబుతూనే ఉండేవాడు నాశనం చేయబడతాడు.
10బుద్ధిహీనుడు ధనవంతునిగా ఉండకూడదు. అది రాజకుమారుల మీద బానిస పరిపాలన చేసినట్టుగా ఉంటుంది.
11ఒక మనిషి జ్ఞానము గలవాడైతే, ఆ జ్ఞానము అతనికి సహనాన్ని ఇస్తుంది. అతని యెడల తప్పు చేసిన వారిని అతడు క్షమించటం అతనికి ఘనతగా ఉంటుంది.
12ఒక రాజు కోపంగా ఉన్నప్పుడు అది సింహగర్జనలా ఉంటుంది. కాని అతడు నీతో సంతోషంగా ఉంటే అది మృదువైన వర్షంలా ఉంటుంది.
13తెలివి తక్కువ కుమారుడు తన తండ్రిని నాశనం చేయగలడు. వాదులాడే భార్య ఎడతెగక కారే నీటి చుక్కల మాదిరి విసుగు కలిగించేదిగా ఉంటుంది.
14మనుష్యులు ఇండ్లు, ధనం వారి తలిదండ్రులనుండి పొందుతారు. అయితే మంచి భార్య యెహోవా నుండి దొరికే వరం.
15సోమరివానికి నిద్ర చాలా ఎక్కువ వస్తుంది. కాని అతడు చాలా ఆకలిగా కూడా ఉంటాడు.
16దైవాజ్ఞకు విధేయునిగా ఉండేవాడు తన ఆత్మను క్షేమంగా ఉంచుకొంటాడు. కాని దైవాజ్ఞను వినుటకు నిరాకరించేవాడు మరణిస్తాడు.
17పేద ప్రజలకు డబ్బులిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అతడు చేసే పనుల కోసం యెహోవా అతనికి బహుమానం ఇస్తాడు.
18నీ కుమారునికి బోధించి, వాడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు. అదొక్కటే ఆశ. అలా చేయటానికి తిరస్కరిస్తే తనను తానే నాశనం చేసుకొనుటకు నీవు అతనికి సహాయం చేస్తున్నావు.
19ఒకడు తేలికగా కోపం తెచ్చుకొంటే అతడు దాని విలువ చెల్లించాలి. అతడు కష్టంలో నుండి బయట పడుటకు నీవు అతనికి సహాయం చేస్తే అతడు తిరిగి నీకూ అలానే చేస్తాడు.
20సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞానముగలవాడవు అవుతావు.
21మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.
22నిజాయితీ, మరియు విశ్వసనీయత మనిషిలో కోరదగ్గవి. విశ్వసనీయత కోల్పోవడం కంటే బీదవాడుగా ఉండటం మేలు.
23యెహోవా యెడల గౌరవం నిజమైన జీవానికి నడిపిస్తుంది. అప్పుడు మనిషికి శాంతి ఉంటుంది. కష్టంలో క్షేమంగా ఉంటాడు.
24సోమరి తనను పోషించుకొనేందుకు తాను చేయాల్సిన పనులు కూడ చేయడు. తన పళ్లెంలోని భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోటానికి కూడా అతనికి బద్ధకమే.
25దేనికీ గౌరవం చూపనివారు శిక్షించబడాలి. అప్పుడు బుద్ధిహీనులు ఒక పాఠం నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి విమర్శించ బడినప్పుడు నేర్చుకొంటాడు.
26ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి తన తల్లిని బలవంతంగా వెళ్లగొడితే, అతడు చాలా దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు, అవమానం తెచ్చుకొంటాడు.
27నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు.
28సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్పు న్యాయంగా ఉండదు. దుర్మార్గులు చెప్పే విషయాలు మరింత దుర్మార్గం తెచ్చి పెడతాయి.
29ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొనే మనిషి శిక్షించబడతాడు. బుద్ధిహీనుడు తనకోసం దాచబడిన శిక్షను పొందుతాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in