సామెతలు 4
4
జ్ఞానము గూర్చి తండ్రి సలహా
1కుమారులారా, “మీ తండ్రి ఉపదేశములు వినండి.” మీరు గ్రహించగలుగునట్లు గమనించండి. 2ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు.
3నేను నా తండ్రికి పసివాడను. నేను నా తల్లికి ఒకే కూమారుణ్ణి. 4నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో ఇలా చెప్పాడు: “నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీవు నా ఆజ్ఞలకు విధేయుడవైతే జీవిస్తావు. 5జ్ఞానము, వివేకం సంపాదించు! నా మాటలు మరువకు. నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు. 6జ్ఞానమునుండి తొలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది.
7“జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. 8జ్ఞానాన్ని ప్రేమించు. జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చి పెడుతుంది. 9ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.”
10కనుక నా మాట విను. నేను చెప్పే సంగతులను జరిగించు. అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు. 11జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. 12ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. 13ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం!
14దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. 15దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. 16చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు. 17ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు.
18మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది. 19చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు.
20నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. 21నా మాటలు నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. 22నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి. 23నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి.
24సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చేప్పవద్దు. అబద్ధాలు చెప్పకు. 25నీ యెదుట ఉన్న జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి పోనివ్వకు. 26సరైన విధంగా జీవించుటకు చాలా జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు స్థిరమైన మంచిజీవితం ఉంటుంది. 27తిన్నని మార్గం విడిచిపెట్టకు అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపొమ్ము.
Currently Selected:
సామెతలు 4: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International