కీర్తనల గ్రంథము 37
37
దావీదు కీర్తన.
1దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
12దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15కాని వారి విల్లులు విరిగిపోతాయి.
వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16దుష్టుల ఐశ్వర్యంకంటే
మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
వారు పొగవలె కనబడకుండా పోతారు.
21దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24అతడు తొట్రుపడినా పడిపోడు,
ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
32కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
35శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36కాని తర్వాత వారు లేకుండా పోయారు.
నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37నీతి, నిజాయితీ కలిగి ఉండి,
సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
Currently Selected:
కీర్తనల గ్రంథము 37: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International