YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 88

88
కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.
1యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
2దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
3నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
4జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
5మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
6యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
7నీవు నా మీద కోపగించావు.
నీవు నన్ను శిక్షించావు.
8నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
9నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
11చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
శిక్ష నన్ను చంపేస్తుంది.
17నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
చీకటి మాత్రమే నాకు మిగిలింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in