ప్రకటన గ్రంథము 1
1
తొలి పలుకు
1దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 2యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. 3ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.
శుభాకాంక్షలు
4యోహాను నుండి,
ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,
భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! 5మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. 6మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.
7చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు#1:7 పొడిచినవాళ్ళు యోహాను 19:34 చూడండి. కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.
8భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును#1:8 ఆదియు, అంతమును ఇది గ్రీకు అక్షరమాలలో మొదటి మరియు చివరి అక్షరాలు. ఈ విధంగా దేవుడే ఆది మరియు అంతము అయివున్నాడు. నేనే” అని అన్నాడు.
9నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
12నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా#1:13 మనుష్యకుమారునిలా దాని. 7:13 చూడండి. ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. 20నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
Currently Selected:
ప్రకటన గ్రంథము 1: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International