1 యోహాను 2
2
1నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలి, మనకొరకు మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కొరకు కూడా.
తోటి విశ్వాసుల పట్ల ప్రేమ ద్వేషం
3ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనం తెలుసుకుంటాము. 4కాని ఎవరైన “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు. 5అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో, వారిలో దేవుని పట్ల ప్రేమ#2:5 ప్రేమ లేదా దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము. 6ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసుక్రీస్తులా జీవించాలి.
7ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు, ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే. 8అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కనుక దాని సత్యం ఆయనలో మీలో కూడ కనిపిస్తూ ఉంది.
9తాను వెలుగులో ఉన్నానని చెప్తూ ఒక సహోదరున్ని లేక సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. 10తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిని అభ్యంతరం కలిగించేది ఏది వారిలో ఉండదు. 11అయితే తన సహోదరిని లేదా సహోదరుని ద్వేషించేవారు చీకటిలో ఉంటారు, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కనుక తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.
వ్రాయడానికి గల కారణాలు
12ప్రియ పిల్లలారా, నేను మీకు వ్రాస్తున్నాను,
ఎందుకంటే, ఆయన నామం వలన మీ పాపాలు క్షమించబడ్డాయి.
13తండ్రులారా, నేను మీకు వ్రాస్తున్నాను,
ఎందుకంటే, ఆది నుండి ఉన్న వానిని మీరు ఎరుగుదురు.
యవ్వనస్థులారా, నేను మీకు వ్రాస్తున్నాను,
ఎందుకంటే, మీరు దుష్టుని జయించారు.
14ప్రియ బిడ్డలారా, నేను మీకు వ్రాస్తున్నాను,
ఎందుకంటే, మీరు తండ్రిని ఎరుగుదురు.
తండ్రులారా, నేను మీకు వ్రాస్తున్నాను,
ఎందుకంటే, ఆది నుండి ఉన్న వానిని మీరు ఎరుగుదురు.
యవ్వనస్థులారా, నేను మీకు వ్రాస్తున్నాను,
ఎందుకంటే, మీరు బలవంతులు;
దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది;
మీరు దుష్టుని జయించారు.
లోకాన్ని ప్రేమించరాదు
15ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేనిని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ#2:15 ప్రేమ లేదా తండ్రి ప్రేమ వారిలో లేదు. 16ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం, ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి. 17ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి కాని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు శాశ్వతంగా జీవిస్తారు.
కుమారుని తిరస్కరించినందుకు హెచ్చరికలు
18ప్రియ పిల్లలారా, ఇది చివరి గడియ; క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నట్లుగానే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీనిని బట్టి ఇదే చివరి గడియ అని మనం తెలుసుకుంటున్నాము. 19వారు మనలో నుండి బయలుదేరారు, కాని నిజానికి వారు మనకు సంబంధించినవారు కారు. ఎందుకంటే వారు మనకు సంబంధించినవారైతే మనతోనే నిలిచివుంటారు; అయితే వారు అలా వెళ్ళిపోవడం వల్ల వారిలో ఒక్కరు కూడా మనకు సంబంధించినవారు కారని తెలుస్తుంది.
20అయితే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు, మీ అందరికి సత్యం తెలుసు.#2:20 కొన్ని ప్రతులలో మీరు సమస్తమును ఎరుగుదురు 21మీకు సత్యం తెలియదని నేను మీకు వ్రాయడం లేదు కాని, సత్యం మీకు తెలుసు, సత్యం నుండి అబద్ధం పుట్టదని మీకు తెలుసు కనుకనే నేను మీకు వ్రాస్తున్నాను. 22అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి. 23ఎందుకంటే, కుమారుని తిరస్కరించిన వారికి తండ్రి లేడు; కుమారుని అంగీకరించినవారికి తండ్రి కూడ ఉన్నాడు.
24మీరైతే, మొదటి నుండి మీరు దేనిని విన్నారో అది మీలో నిలిచివుండేలా చూసుకోండి. అది మీలో నిలిచివుంటే, మీరు కూడా కుమారునిలో తండ్రిలో నిలిచివుంటారు. 25ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవం.
26మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను. 27మీరైతే, ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది, కనుక ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధం కాదు; అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది. అది మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచివుండండి.
దేవుని బిడ్డలు మరియు పాపం
28కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగివుండునట్లు, మీరు ఆయనలో కొనసాగండి.
29ఆయన నీతిమంతుడని మీరు ఎరిగివుంటే, నీతిని జరిగించే ప్రతి ఒక్కరు ఆయన మూలంగా పుట్టారని మీరు తెలుసుకుంటారు.
Currently Selected:
1 యోహాను 2: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.