3
1మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు. 2ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు,#3:2 లేదా, అది తెలియజేయబడినప్పుడు ఆయన యదార్థరూపంను మనం చూస్తాము గనుక, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము. 3ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే, తనను పవిత్రునిగా చేసుకుంటారు.
4పాపం చేసే ప్రతివారు ఆజ్ఞను అతిక్రమిస్తారు; ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. 5పాపాలను తొలగించడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యారని మీకు తెలుసు. ఆయనలో ఎలాంటి పాపం లేదు. 6ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు.
7ప్రియ పిల్లలారా, మీరు ఎవరిచేత మోసపోకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, నీతిని జరిగించే ప్రతివారు నీతిమంతులే. 8సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కనుక పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు. 9దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కనుక వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కనుక పాపం చేయలేరు. 10దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని లేక సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు.
అన్యోన్య ప్రేమ మరియు ద్వేషం
11మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి 12కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి. 13నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. 14మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు. 15తన సహోదరిని లేదా సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు.
16ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కనుక దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కొరకు మన ప్రాణాలను పెట్టవలసిన వారిగా ఉన్నాము. 17ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరునికి లేదా సహోదరికి చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? 18ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.
19దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలను ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉండనిస్తాం; 20మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము. 21ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యం కలిగివుంటాము. 22ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదానిని ఆయన నుండి పొందుకుంటాము. 23ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నాడని మనకు తెలుస్తుంది.