4
మోసపరచు ఆత్మలను తిరస్కరించుట
1ప్రియ మిత్రులారా, అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో బయలుదేరారు, కనుక ప్రతి ఆత్మను నమ్మకుండా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. 2దేవుని ఆత్మను మనం ఈ విధంగా గుర్తించవచ్చు: యేసు క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి వచ్చారని ఒప్పుకొనే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందే. 3అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు, కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చివున్నది.
4ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్న వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు. 5వారు లోకానికి చెందినవారు కనుక లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది. 6కాని మనం దేవునికి చెందినవారము, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కనుక సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనం గుర్తిస్తాము.
దేవుని ప్రేమ మరియు మన ప్రేమ
7ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కనుక మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కనుక వారు దేవుణ్ణి ఎరిగినవారు. 8దేవుడే ప్రేమ, కనుక ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. 9దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధంగా చూపించారు: ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. 10ఇదే ప్రేమ: మనం దేవుడిని ప్రేమించామని కాదు, కాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. 11ప్రియ మిత్రులారా, దేవుడు మనలను ఎంతో ప్రేమించారు కనుక మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించాలి. 12దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.
13మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు. 14మరియు లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం చూశాము సాక్ష్యమిచ్చాము. 15యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. 16ప్రేమ మనకు తెలుసు మరియు మనం దానిపైన ఆధారపడుతున్నాం.
దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు. 17తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండునట్లు దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము. 18ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కనుక భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.
19ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కనుక మనం ప్రేమిస్తున్నాము. 20అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని లేదా సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు. 21కనుక దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ.