YouVersion Logo
Search Icon

1 తిమోతికి 6

6
1దేవుని నామాన్ని మేము చేసిన బోధలను ప్రజలు దూషించకుండ ఉండడానికి, దాసులుగా బానిసత్వపు కాడి క్రింద వున్న విశ్వాసులైన వారందరు తమ యజమానులను గౌరవించదగినవారిగా భావించాలి. 2విశ్వాసులైన యజమానులను కలిగినవారు వారు తమ తోటి విశ్వాసులే కదా అని అగౌరవంగా ప్రవర్తించకూడదు. పైగా తోటి విశ్వాసులైన తమ యజమానులు తమకెంతో ప్రియమైనవారని, వారు తమ దాసుల క్షేమం కొరకు నియమించబడినవారని, వారికి మరింత బాగా సేవలు చేయాలి.
అబద్ధ బోధకులు మరియు ధనాన్ని ప్రేమించేవారు
నీవు ఈ సంగతులు బోధించి విశ్వాసులను ప్రోత్సాహించాలి. 3మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మంచి ఉపదేశాలకు మన దైవభక్తిని పెంచే బోధకు వ్యతిరేకమైన బోధను ఎవరైనా బోధిస్తే, 4అలాంటివారు వివేకం లేనివారు అహంకారులు. అలాంటివారు, మాటల వలన కలిగే వివాదాలలో గొడవలలో అనవసరమైన ఆసక్తి కలిగివుంటారు. దాని ఫలితంగా అసూయలు, కలహాలు, ద్వేషపూరితమైన మాటలు, దుష్ట సందేహాలు కలుగుతాయి, 5దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.
6అయితే సంతృప్తితో దైవభక్తి కలిగివుండడమే గొప్ప లాభదాయకం. 7మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, దాని నుండి ఏమి తీసుకుపోలేము. 8కనుక మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగివుంటే, వాటితో తృప్తిచెందాలి. 9అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకొనే వారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు. 10డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి మూలం. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు.
తిమోతికి చివరి బాధ్యత
11అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు. 12విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం యెదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు. 13అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని యెదుట, పొంతి పిలాతు యెదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను. 14నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు నిందగాని డాగుగాని లేకుండా ఈ ఆజ్ఞలకు లోబడు. 15రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏకైక అధిపతిగా ఉన్న భాగ్యవంతుడైన దేవుణ్ణి తగిన సమయంలో దేవుడు ప్రత్యక్షపరుస్తారు. 16ఆయన ఒక్కడే మరణం లేనివాడు, ఆయన సమీపించలేనంత వెలుగులో నివసిస్తాడు, ఆయనను ఎవరూ ఎన్నడు చూడలేదు, ఎన్నడు చూడలేరు. అలాంటి దేవునికే ఘనత ప్రభావాలు నిరంతరం కలుగును గాక ఆమేన్.
17ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచకుండా, వారి సంతోషం కొరకు కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించు దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు. 18వారు మంచిని చేస్తూ, మంచి పనులు చేయడంలో ధనవంతులుగా ఇతరులకు ఇవ్వడంలో ధారాళంగా ఉండుమని ఆజ్ఞాపించు. 19ఈ విధంగా రాబోవు కాలానికి దృఢమైన పునాది కాగల ధనాన్ని వారు తమ కొరకు కూర్చుకుంటారు, అప్పుడు వారు నిజమైన జీవాన్ని సంపాదించుకోగలరు.
20తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండుము. 21కొందరు అలాంటి జ్ఞానాన్ని కలిగివున్నామని చెప్పుకొంటూ విశ్వాసం నుండి తొలగిపోయారు.
కృప నీకు తోడై ఉండును గాక!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in