YouVersion Logo
Search Icon

2 కొరింథీ పత్రిక 6

6
1దేవుని తోటిపనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము. 2అయితే,
“నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను,
రక్షణ దినాన నేను నీకు సహాయం చేశాను”#6:2 యెషయా 49:8
అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
పౌలు కష్టాలు
3మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు. 4కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో; 5దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో; 6పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో; 7సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి; 8ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది; 9తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు; 10దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము.
11కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం. 12మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు. 13నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.
విగ్రహారాధన గురించి హెచ్చరిక
14అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి? 15క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి? 16దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు:
“నేను వారితో నివసిస్తాను
వారి మధ్య నడుస్తాను,
నేను వారి దేవునిగా ఉంటాను,
వారు నా ప్రజలుగా ఉంటారు.”#6:16 లేవీ 26:12; యిర్మీయా 32:38; యెహె 37:27
17కాబట్టి,
“వారి మధ్య నుండి బయటకు వచ్చి
ప్రత్యేకంగా ఉండండి,
అని ప్రభువు చెప్తున్నాడు.
అపవిత్రమైన దానిని తాకకండి,
అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.#6:17 యెషయా 52:11; యెహె 20:34,41
18ఇంకా,
“నేను మీకు తండ్రిగా ఉంటాను,
మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు,
అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”#6:18 2 సమూ 7:14; 7:8

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in