YouVersion Logo
Search Icon

2 కొరింథీ పత్రిక 8

8
ప్రభువు ప్రజల కోసం సేకరించుట
1సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. 2చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు. 3ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను. 4ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు. 5వారు మా అంచనాలను అధిగమించారు: మొదటిగా తమను తాము ప్రభువుకు అర్పించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు కూడ తమను అర్పించుకున్నారు. 6కాబట్టి తీతు ఈ దాతృత్వ పనిని గతంలో ప్రారంభించినట్లే మీ వైపు నుండి కూడా దానిని పూర్తి చేయమని అతన్ని వేడుకున్నాము. 7అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో ఎలా వృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా వృద్ధిచెందేలా చూసుకోండి.
8ఆజ్ఞాపించి మీకు చెప్పడం లేదు, కాని సహాయం చేయడంలో ఇతరుల ఆసక్తితో పోల్చి మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలనుకుంటున్నాను. 9మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.
10ఈ విషయంలో మీకు ఏది మంచిదో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. గత ఏడాది మీరు ఇవ్వడంలోనే కాదు అలా చేయాలనే ఆసక్తిలో కూడా మొదటివారిగా ఉన్నారు. 11కాబట్టి ఆ పనిని ముగించండి, అప్పుడు చేయాలనే మీ ఆసక్తిని, మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పూర్తి చేయడం ద్వారా సరిపోల్చవచ్చు. 12ఎందుకంటే, ఇవ్వాలనే ఆసక్తి మీకు ఉంటే, మీ సామర్థ్యాన్ని మించి కాకుండా మీకు ఉన్నదానిలో ఇచ్చే మీ కానుక అంగీకరించదగింది.
13మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. 14ప్రస్తుత సమయంలో మీ సమృద్ధి వారికవసరమైనది సరఫరా చేస్తుంది, అలాగే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధి మీకు అవసరమైనది సరఫరా చేస్తుంది. సమానత్వమే లక్ష్యం, 15ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు”#8:15 నిర్గమ 16:18 అని వ్రాయబడి ఉంది.
సేకరించిన వాటిని తీసుకోవడానికి తీతు పంపబడుట
16మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు. 17తీతు మా మనవిని అంగీకరించడమే కాకుండా, అతడు ఎంతో ఉత్సాహంతో తన ఇష్టంతో మీ దగ్గరకు వస్తున్నాడు. 18సువార్త పరిచర్య చేయడంలో సంఘాలన్నింటిలో ప్రసిద్ధి చెందిన సోదరుని కూడా అతనితో పంపుతున్నాను. 19అంతేకాక, కేవలం ప్రభువును మహిమపరచడానికి, సహాయం చేయడంలో మాకున్న ఆసక్తిని చూపించడానికి మేము చేస్తున్న దానిలో భాగంగా కానుకలను తీసుకెళ్తున్నప్పుడు మాతో పాటు ఉండడానికి సంఘాలు అతన్ని ఏర్పరచుకున్నారు. 20దాతృత్వంతో ఇచ్చిన కానుకలను మేము ఉపయోగించే విధానం గురించి ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతున్నాము. 21కేవలం ప్రభువు దృష్టిలో మాత్రమే గాక, మనుష్యుల దృష్టికి కూడా మంచిది అనిపించిందే చేయాలని మేము బాధలు అనుభవిస్తున్నాము.
22అంతేకాక, మా సహోదరున్ని వారితో కూడా పంపుతున్నాము. అతడు ఆసక్తి కలిగినవాడని మాకు అనేకసార్లు రుజువుచేసి చూపించాడు. మీపై అతనికున్న నమ్మకాన్ని బట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడు. 23ఇక తీతు అయితే నా జతపనివాడు మీ మధ్యలో తోటి పనివాడు; మా సహోదరులైతే సంఘాలకు ప్రతినిధులు క్రీస్తుకు ఘనత తెచ్చేవారు. 24అందువల్ల వారికి మీ ప్రేమను చూపించండి, మీ గురించి మేము ఎందుకు గర్విస్తున్నామో చూపించండి. అప్పుడు సంఘాలు కూడా తెలుసుకోగలవు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in