YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 10

10
కొర్నేలీ పేతురును పిలిపించుకొనుట
1ఇటలీ దేశ సైనిక దళానికి శతాధిపతి యైన కొర్నేలీ అనే వ్యక్తి కైసరయ పట్టణంలో ఉన్నాడు. 2అతడు అతని కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగినవారు; అవసరంలో ఉన్న ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేస్తూ క్రమంగా దేవునికి ప్రార్థన చేసేవాడు. 3ఒక రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఒక దేవదూత ప్రత్యక్షమై, “కొర్నేలీ!” అని పిలువడం ఆ దర్శనంలో స్పష్టంగా కనబడింది.
4కొర్నేలీ భయంతో అతన్ని తేరి చూస్తూ, “ఏమిటి, ప్రభువా?” అని అడిగాడు.
అప్పుడు ఆ దూత, “నీ ప్రార్థనలు పేదవారికి నీవు చేసిన దానధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ అర్పణగా చేరాయి. 5నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. 6అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
7అతనితో మాట్లాడిన ఆ దేవదూత వెళ్లిపోయిన తర్వాత కొర్నేలీ తన సేవకులలో ఇద్దరిని, తన వ్యక్తిగత సేవలు చేసే దైవభక్తి గల ఒక సైనికుని పిలిచాడు. 8వారికి జరిగినదంతా చెప్పి యొప్పేకు పంపించాడు.
పేతురుకు కలిగిన దర్శనము
9వారు బయలుదేరి ప్రయాణమై పట్టణాన్ని చేరుకోబోతున్నప్పటికి మరుసటిరోజు సుమారు మధ్యాహ్న సమయంలో, పేతురు ప్రార్థన చేసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్లాడు. 10అతనికి చాలా ఆకలివేసి ఏమైనా తినాలని అనిపించింది, భోజనం సిద్ధం చేస్తుండగా అతడు స్వాప్నిక స్థితిలోనికి వెళ్లాడు. 11అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూశాడు. 12దానిలో నాలుగు కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు పక్షులు ఉన్నాయి. 13అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.”
14అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు.
15రెండవసారి ఆ స్వరం అతనితో, “దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు” అన్నది.
16ఈ విధంగా మూడుసార్లు జరిగింది, వెంటనే ఆ దుప్పటి తిరిగి ఆకాశానికి కొనిపోబడింది.
17పేతురు ఆ దర్శనానికి భావం ఏమిటని ఆశ్చర్యపడుతున్నప్పుడు, కొర్నేలీ పంపినవారు, సీమోను ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకొని దాని ద్వారం ముందు నిలబడ్డారు. 18ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు.
19పేతురు ఇంకా ఆ దర్శనం గురించి ఆలోచిస్తుండగా, ఆత్మ అతనితో, “సీమోను నీకోసం ముగ్గురు వ్యక్తులు చూస్తున్నారు. 20నీవు లేచి క్రిందికి వెళ్లు. నేనే వారిని పంపించాను, కాబట్టి నీవు వారితో వెళ్లడానికి సందేహించకు” అని చెప్పారు.
21పేతురు క్రిందికి వెళ్లి వారితో, “మీరు వెదికేది నా కోసమే, మీరు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు.
22అందుకు వారు, “కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర నుండి మేము వచ్చాము. అతడు నీతిమంతుడు దేవుని భయం కలవాడు, యూదులందరిచే గౌరవించబడుతున్నవాడు. నీవు చెప్పేది వినడానికి నిన్ను ఇంటికి పిలుచుకొని రమ్మని ఒక పరిశుద్ధ దేవదూత అతనితో చెప్పాడు” అన్నారు. 23అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు.
కొర్నేలీ ఇంట్లో పేతురు
మరుసటిరోజు పేతురు వారితో కలిసి బయలుదేరాడు, వారితో పాటు యొప్పేలో ఉన్న కొందరు విశ్వాసులు కూడా వెళ్లారు. 24ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. 25పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. 26అయితే పేతురు, “లేచి నిలబడు, నేను కూడా మనిషినే” అని చెప్పి అతన్ని పైకి లేపాడు.
27పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చి ఉండడం చూశాడు. 28అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధము. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేధించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు. 29కాబట్టి నీవు నన్ను పిలిచినప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు చెప్పండి?” అని అడిగాడు.
30అందుకు కొర్నేలీ, “మూడు రోజుల క్రితం ఇదే సమయంలో అనగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తునప్పుడు అకస్మాత్తుగా మెరుస్తున్న వస్త్రాల్లో ఉన్న ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి, 31నాతో, ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలను ఆలకించాడు నీవు పేదవారికి చేసిన దానధర్మాలను జ్ఞాపకం చేసుకున్నాడు. 32నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. 33కాబట్టి నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషము. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు.
34అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు, 35కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. 36అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు. 37యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు. 38దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు.
39“యూదయా ప్రాంతంలో యెరూషలేము పట్టణంలో యేసు చేసిన కార్యాలన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ మీద వ్రేలాడదీసి చంపారు. 40కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. 41ఆయన ప్రజలందరికి కనబడలేదు; కానీ దేవుడు ముందుగానే తన సాక్షులుగా ఏర్పరచుకున్నవారికి అనగా ఆయన మరణం నుండి తిరిగి జీవంతో లేచిన తర్వాత ఆయనతో పాటు తిని త్రాగిన మాకు కనబడ్డారు. 42దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు. 43ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”
44పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. 45యూదేతరుల మీద కూడా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడడం చూసి పేతురుతో వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు. 46దానికి కారణం వారందరు ఇతర భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించడం విన్నారు.
అప్పుడు పేతురు, 47“మనం పొందుకొన్న విధంగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వీరిని నీటి బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకపరచగలమా? ఆటంకపరచలేము కదా” అని అన్నాడు. 48కాబట్టి వారు యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు. ఆ తర్వాత వారు పేతురును తమతో మరికొన్ని రోజులు ఉండమని బ్రతిమాలుకొన్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for అపొస్తలుల కార్యములు 10