YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 13

13
1అంతియొకయ సంఘంలో ప్రవక్తలు మరియు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్ధాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు. 2ఒక రోజు వారు ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబా మరియు సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచండి” అని చెప్పాడు. 3కనుక వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపించారు.
కుప్రలో
4వారిద్దరు పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత, సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్ర ద్వీపానికి వెళ్లారు. 5వారు సలమీ పట్టణానికి చేరాక, దేవుని వాక్యాన్ని యూదుల సమాజమందిరాల్లో ప్రకటించారు. అప్పుడు మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
6వారు పాఫు అనే ఊరు వచ్చేవరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బర్ యేసు అనే పేరుగల యూదా మంత్రగాడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకొన్నారు. 7అతడు సెర్గియ పౌలు అనే రోమా అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి తెలివిగలవాడు, అతడు దేవుని వాక్యాన్ని వినాలని బర్నబాను మరియు సౌలును పిలిపించుకున్నాడు. 8అయితే ఎలీమాస్ అనే మంత్రగాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 9అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఎలీమాస్ వైపు నేరుగా చూస్తూ, 10“నీవు సాతాను బిడ్డవు మరియు నీతికార్యాలన్నింటికి విరోధివి! నీవు అన్ని రకాల కపటంతో మోసంతో నిండి ఉన్నావు. ప్రభువు యదార్థ మార్గాలను చెడగొట్టడం మానవా? 11ఇదిగో, దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉంది. నీవు సూర్యుని కాంతిని కూడా చూడలేక కొంత కాలం గ్రుడ్డివాడివి అవుతావు” అన్నాడు.
వెంటనే అతని మీదికి మబ్బు వంటి చీకటి కమ్మింది, కనుక అతడు తడుముకుంటూ తనను ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపిస్తారని వెదకసాగాడు. 12జరిగింది అంతా ఆ అధిపతి చూసి, ప్రభువు గురించిన బోధకు ఆశ్చర్యపడి నమ్మాడు.
పిసిదియలోని అంతియొకయలో
13తర్వాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి పంఫులియా లోని పెర్గే పట్టణానికి వచ్చారు, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు. 14అప్పుడు వారు పెర్గే పట్టణం నుండి బయలుదేరి పిసిదియ ప్రాంతంలోని అంతియొకయ పట్టణానికి వచ్చారు. సబ్బాతు దినాన వారు సమాజమందిరానికి వెళ్లి కూర్చున్నారు. 15ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు, “సహోదరులారా, ప్రజలను ప్రోత్సహించే వాక్యం చెప్పాలని ఉంటే చెప్పండి” అని వారికి వర్తమానం పంపారు.
16పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! 17ఇశ్రాయేలు దేశప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని, వారిని ఐగుప్తులో అభివృద్ధిపరచి, వారిని తన గొప్ప శక్తితో ఆ దేశం నుండి బయటకు రప్పించారు. 18రప్పించిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రవర్తనను సహించారు, 19కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు. 20సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్నీ జరిగాయి.
“ఆ తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు. 21తర్వాత ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా ఇచ్చారు, అతడు వారిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 22సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. ‘యెష్షయి కుమారుడైన దావీదును నా హృదయానుసారునిగా నేను కనుగొన్నాను. నేను చేయాలని ఉద్దేశించిన వాటన్నింటిని అతడు నెరవేర్చుతాడు’ అని దేవుడు అతని గురించి సాక్ష్యమిచ్చాడు.
23“దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కొరకు యేసు రక్షకుని పుట్టించారు. 24యేసు రాకముందు, పశ్చాత్తాపం మరియు బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. 25యోహాను తాను వచ్చిన పనిని ముగిస్తూ, ‘నేను ఎవరని మీరు అనుకుంటున్నారా? మీరు ఎదురు చూస్తున్న వానిని నేను కాదు. కాని నా తర్వాత వస్తున్న వాని చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు’ అన్నాడు.
26“తోటి అబ్రాహాము సంతానమా మరియు దేవుని భయభక్తులు గల ఇతర జాతుల వారలారా, ఈ రక్షణ సందేశం మన కొరకే పంపబడింది. 27యెరూషలేము ప్రజలు మరియు వారి పరిపాలకులు యేసును గుర్తు పట్టలేదు, కాని వారు యేసుకు మరణశిక్షను విధించుట ద్వార ప్రతి సబ్బాతు దినాన చదవబడే ప్రవక్తల మాటలను నెరవేర్చారు. 28ఆయనలో మరణశిక్షకు తగిన ఏ ఆధారం కనబడకపోయినా, ఆయనను చంపాలని వారు పిలాతును వేడుకొన్నారు. 29ఆయన గురించి వ్రాయబడిన వాటన్నిటిని వారు నెరవేర్చిన తర్వాత, ఆయనను సిలువ మీది నుండి దించి సమాధిలో పెట్టారు. 30కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. 31ఇంకా ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో ప్రయాణం చేసినవారికి చాలా రోజులు కనిపించారు. వారే ఇప్పుడు మన ప్రజలకు సాక్షులుగా ఉన్నారు.
32“మేము మీకు చెప్పే సువార్త ఏంటంటే: దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం, 33యేసును మరణం నుండి లేపడం ద్వారా ఆయన పిల్లలంగా ఉన్న మనకొరకు నెరవేర్చారు. రెండవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ ‘నీవు నా కుమారుడవు;
ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.’#13:33 కీర్తన 2:7
34ఆయన ఎప్పటికీ కుళ్ళిపోకూడదని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు. దేవుడు చెప్పినట్లే,
“ ‘నేను దావీదుకు వాగ్దానం చేసిన పవిత్రమైన,
నమ్మదగిన దీవెనలను మీకు అనుగ్రహిస్తాను.’#13:34 యెషయా 55:3
35మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ ‘నీ పరిశుద్ధుని కుళ్ళి పోనీయవు.’#13:35 కీర్తన 16:10
36“దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత, చనిపోయాడు; అతడు అతని పితరుల వలె పాతిపెట్టబడగా అతని శరీరం కుళ్ళిపోయింది. 37కానీ దేవుడు మరణం నుండి లేపినవాని శరీరం కుళ్ళు పట్టలేదు.
38“కనుక, నా స్నేహితులారా, యేసు ద్వారానే పాపక్షమాపణ కలుగునని ప్రకటించబడింది అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. 39ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడం సాధ్యం కాలేదు, కాని క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన ద్వారా ప్రతి పాపం నుండి విడుదల పొంది నిర్దోషిగా తీర్చబడుతున్నారు. 40కానీ ప్రవక్తలు ముందుగానే చెప్పినది మీ మీద రాకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోండి అవేమంటే:
41“ ‘చూడండి, ఎగతాళి చేసేవారలారా,
ఆశ్చర్యపడి నశించిపోయేవారలారా వినండి,
నేను మీ కాలంలో ఒక కార్యాన్ని చేయబోతున్నాను,
దాని గురించి మీకు ఎవరు వివరించినా
దానిని మీరు నమ్మలేరు.’#13:41 హబ 1:5
42పౌలు మరియు బర్నబా సమాజమందిరంలో నుండి వెళ్తున్నప్పుడు, మరో సబ్బాతు దినాన కూడా ఈ సంగతుల గురించి మళ్ళీ చెప్పాలని ప్రజలు వారిని బ్రతిమలాడారు. 43వచ్చినవారు వెళ్లిపోయిన తర్వాత, చాలామంది యూదులు, యూదా మతంలోనికి మారిన వారు, దేవుని కృపలో కొనసాగాలని తమతో మాట్లాడి, తమను బ్రతిమాలిన పౌలును బర్నబాను వెంబడించారు.
44మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు. 45యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు.
46అయితే పౌలు మరియు బర్నబాలు ధైర్యంగా వారికి సమాధానం ఇచ్చారు: “మేము దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాలి. కానీ మీరు దానిని తిరస్కరించి నిత్యజీవానికి అర్హులుగా ఎంచుకోలేదు, కాబట్టి మేము యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాం. 47ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే:
“మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా,
నేను మిమ్మల్ని యూదేతరులందరికి వెలుగుగా నియమించాను.”#13:47 యెషయా 49:6
48అప్పుడు యూదేతరులు ఈ మాటలు విని సంతోషించి ప్రభువు వాక్యాన్ని గౌరవించారు. మరియు నిత్యజీవం కొరకు నియమించబడిన వారందరు నమ్మారు.
49ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది. 50కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను మరియు ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు. 51కనుక వారు తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడ నుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు. 52ఆ ప్రాంతపు శిష్యులు పరిశుద్ధాత్మతో ఆనందంతో నింపబడ్డారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in