YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 14

14
ఈకొనియలో పౌలు మరియు బర్నబాలు
1ఈకొనియ పట్టణంలో పౌలు మరియు బర్నబాలు ఎప్పటిలాగే యూదుల సమాజమందిరంలో ప్రవేశించి వాక్యాన్ని చాలా ప్రభావవంతంగా మాట్లాడినప్పుడు చాలామంది యూదులు మరియు గ్రీసు దేశస్థులు నమ్మారు. 2కాని నమ్మని యూదులు, యూదేతరులను రేపి, సహోదరులకు విరోధంగా వారి మనస్సులలో ద్వేషాన్ని పుట్టించారు. 3అయినా పౌలు మరియు బర్నబాలు ప్రభువు కొరకు ధైర్యంగా మాట్లాడుతూ చాలా కాలం అక్కడే ఉండి, ప్రభువు గురించి బోధిస్తూ ఉండగా, ప్రభువు వారి ద్వారా సూచక క్రియలను అద్బుతాలను చేయించి తన కృపా సందేశాన్ని రుజువుపరిచారు. 4ఆ పట్టణ ప్రజలలో కొందరు యూదుల పక్షంగా మరికొందరు అపొస్తలుల పక్షంగా విడిపోయారు. 5యూదులు మరియు యూదేతరులు తమ నాయకులతో కలిసి, వారిని రాళ్ళతో కొట్టి చంపాలని తలంచారు. 6కానీ వారు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడి నుండి లుకయొనియ ప్రాంతంలోని లుస్త్ర దెర్బే పట్టణాలకు మరియు వాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లి, 7అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు.
లుస్త్ర దెర్బే పట్టణములలో
8లుస్త్రలో కుంటివాడొకడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అలా ఉన్నాడు కనుక ఎప్పుడు నడవలేదు. 9అతడు పౌలు చేసే బోధను వినేటప్పుడు, పౌలు సూటిగా అతని వైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, 10అతనితో, “లేచి నీ కాళ్ళ మీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు.
11పౌలు చేసిన కార్యాన్ని జనసమూహం చూసి, వారు లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవరూపంలో మనకొరకు దిగి వచ్చారు” అని కేకలు వేశారు. 12బర్నబాకు జూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెస్ అని పేర్లు పెట్టారు. 13ఆ పట్టణం బయట ఉన్న జూస్ గుడి పూజారి ప్రజలతో కలిసి ఎద్దులను, పూలదండలను పట్టణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారికి బలి అర్పించాలని అనుకున్నారు.
14అయితే అపొస్తలులైన బర్నబా మరియు పౌలు ఈ సంగతి విని, తమ వస్త్రాలను చింపుకొని ఆ జనసమూహంలోనికి చొరబడి, బిగ్గరగా ఇలా అన్నారు: 15“స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. 16గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాలలో వెళ్లనిచ్చాడు. 17అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ మనస్సులను సంతోష పరుస్తున్నారు.” 18వారు ఈ మాటలు చెప్పినా కానీ తమకు బలి అర్పించాలనుకున్న సమూహాన్ని ఆపడం కష్టమైపోయింది.
19అంతియొకయ మరియు ఈకొనియ ప్రాంతాల నుండి వచ్చిన కొందరు యూదులు జనసమూహాన్ని తమ పక్షం చేసికొని, పౌలును రాళ్ళతో కొట్టించి, అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని పోయారు. 20కానీ విశ్వాసులు అతని చుట్టు చేరిన వెంటనే, అతడు లేచి పట్టణంలోనికి తిరిగి వెళ్లాడు. మరుసటిరోజు అతడు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.
సిరియాలోని అంతియొకయకు తిరిగి వచ్చుట
21వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేశారు. తర్వాత లుస్త్ర, ఈకొనియ మరియు అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. 22శిష్యులను బలపరచి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సాహించారు. “మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక హింసలు పొందాల్సి ఉంది” అని వారు చెప్పారు. 23పౌలు మరియు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు. 24వారు పిసిదియ ప్రాంతం ద్వారా పంఫులియా ప్రాంతానికి వచ్చి, 25అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.
26అత్తాలియ పట్టణం నుండి బయలుదేరి ఓడ ఎక్కి తాము ఇంతవరకు పూర్తి చేసిన పనిని దేవుని కృపకు అప్పగించి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చారు. 27అక్కడ చేరిన వెంటనే, సంఘమంతటిని సమకూర్చి దేవుడు తమ ద్వారా జరిగించిన కార్యాలను, యూదేతరుల కొరకు ఆయన ఏ విధంగా విశ్వాసపు ద్వారాన్ని తెరిచాడో వారికి వివరంగా తెలియచేశారు. 28ఆ తర్వాత వారు శిష్యులతో కలిసి అక్కడే చాలా కాలం ఉన్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in