YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 22

22
1“సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు వాదన వినండి” అన్నాడు.
2అతడు హెబ్రీ భాషలో మాట్లాడడం విని, వారందరు మరింత నిశ్శబ్దంగా ఉన్నారు.
అప్పుడు పౌలు వారితో ఈ విధంగా చెప్పాడు, 3“నేను కిలికియ ప్రాంతపు తార్సు పట్టణంలో పుట్టిన యూదుడను, కాని ఈ పట్టణంలోనే పెరిగి పెద్దవాడినయ్యాను, గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర మన పితరుల ధర్మశాస్త్ర విద్యను పూర్తిగా అభ్యసించాను. మీరందరిలా నేను కూడా దేవుని కొరకు ఆసక్తి కలవాడిని. 4క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో పడవేసి, వారిలో అనేకమందిని చచ్చే వరకు హింసించాను. 5ఈ విషయాల గురించి ప్రధాన యాజకుడు మరియు న్యాయసభ సభ్యులందరు సాక్ష్యం ఇవ్వగలరు. దమస్కులోని వారి సహచరులకు ఇవ్వవలసిన ఉత్తరాలు కూడా నేను వారి దగ్గరి నుండి తీసుకొని, శిక్షించబడడానికి వీరిని బంధీలుగా యెరూషలేముకు తీసుకొనిరావడానికి వెళ్లాను.
6“నేను దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, మధ్యాహ్న సమయంలో, అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. 7నేను నేల మీద పడి ఒక స్వరం నాతో, ‘సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అనడం విన్నాను.
8“అందుకు నేను, ‘ప్రభువా, నీవెవరవు?’ అని అడిగాను.
“అప్పుడు ఆ స్వరం నాతో, ‘నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును నేనే’ అని జవాబిచ్చాడు. 9నాతో ఉన్నవారు వెలుగును చూసారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.
10“ ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను.
“అప్పుడు ‘నీవు లేచి, దమస్కు పట్టణంలోనికి వెళ్లు, అక్కడ నీవు ఏమి చేయాలని నేను నిర్ణయించానో నీకు తెలియజేస్తాను’ అని చెప్పాడు. 11ప్రకాశమానమైన ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చేసినందుకు, నాతో ఉన్నవారు నా చేతిని పట్టుకొని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.
12“అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులందరి చేత మంచి పేరు పొందిన భక్తిపరుడు. 13అతడు నా ప్రక్కన నిలబడి, ‘సహోదరుడా సౌలు చూపుపొందుకో!’ అన్నాడు. వెంటనే నేను అతన్ని చూడగలిగాను.
14“అప్పుడు అతడు, ‘మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతుని చూడడానికి మరియు ఆయన నోటి మాటలను వినడానికి నిన్ను ఎన్నుకున్నాడు. 15నీవు చూసి వినిన దాని గురించి ప్రజలందరికి చెప్పే సాక్షిగా ఉంటావు. 16నీవు ఇంకా దేని కొరకు ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థన చేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’
17“నేను యెరూషలేముకు తిరిగి వచ్చి, దేవాలయంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలోనికి వెళ్లి, 18ప్రభువు నాతో మాట్లాడడం చూసాను. ఆయన, ‘త్వరగా! నీవు వెంటనే యెరూషలేమును విడిచి వెళ్లు, ఎందుకంటే, నా గురించి నీవు ఇచ్చే సాక్ష్యం ఇక్కడి ప్రజలు అంగీకరించరు’ అని చెప్పారు.
19“అందుకు నేను, ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తు, నిన్ను నమ్మినవారిని చెరసాలలో వేయించి హింసించానని నీకు తెలుసు. 20నీ కొరకు హతసాక్షిగా చనిపోయిన స్తెఫను రక్తం చిందినప్పుడు నేను అక్కడే నిలబడి దానికి సమ్మతించి, అతన్ని చంపిన వారి వస్త్రాలకు కాపలాగా ఉన్నానని తెలుసు కదా’ అన్నాను.
21“అప్పుడు ప్రభువు నాతో, ‘నీవు వెళ్లు, నేను నిన్ను వీరి నుండి దూరంగా యూదేతరుల దగ్గరకు పంపిస్తాను’ అని చెప్పారు.”
రోమీయుడైన పౌలు
22పౌలు చెప్పిందంతా ఆ ప్రజలు విని, “వీనిని భూమి మీద ఉండకుండ చేయండి! ఇలాంటి వాడు బ్రతుక కూడదు!” అని బిగ్గరగా కేకలు వేశారు.
23ఇతడు దైవదూషణ చేస్తున్నాడని కేకలువేస్తూ తమ వస్త్రాలను విసిరేస్తూ, దుమ్మెత్తి ఆకాశంలోనికి పోస్తున్నప్పుడు, 24సైన్యాధిపతి పౌలును సైనిక కోటలోకి తీసుకొనివెళ్ళి, ప్రజలు అతని గురించి ఎందుకు అలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టించి, విచారించమని ఆదేశించాడు. 25వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు.
26అది విన్న ఆ శతాధిపతి, తన అధిపతి దగ్గరకు వెళ్లి అతనితో, “మీరేమి చేస్తున్నారు? ఈ వ్యక్తి రోమీయుడు” అని చెప్పాడు.
27ఆ అధిపతి పౌలు దగ్గరకు వెళ్లి, “నీవు రోమీయుడవా?” అని అడిగాడు.
“అవును, నేను రోమీయుడనే” అని సమాధానం ఇచ్చాడు.
28అప్పుడు ఆ అధిపతి, “నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను” అన్నాడు.
దానికి పౌలు, “నేను పుట్టుకతోనే రోమీయుడను” అని సమాధానం చెప్పాడు.
29అతన్ని విచారణ చేయబోయేవారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. గొలుసులతో బంధించిన పౌలు రోమీయుడని తెలుసుకొన్న తర్వాత అధిపతి కూడా భయపడ్డాడు.
యూదుల న్యాయసభ ముందు పౌలును విచారించుట
30ఆ అధిపతి పౌలు ఎందుకు యూదుల చేత నిందింపబడుతున్నాడో సరిగా తెలుసుకోవాలనుకున్నాడు. మరుసటిరోజు అతన్ని విడిచిపెట్టి, ముఖ్యయాజకులను యూదుల న్యాయసభ సభ్యులందరిని సమావేశమవ్వమని ఆదేశించి పౌలును వారి ముందు నిలబెట్టాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for అపొస్తలుల కార్యములు 22