అపొస్తలుల కార్యములు 7
7
స్తెఫెను న్యాయసభను ఉద్దేశించి మాట్లాడుట
1అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.
2అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, 3‘నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’#7:3 ఆది 12:1 అని చెప్పారు.
4“కాబట్టి అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు. 5ఇక్కడ అతనికి ఒక పాదం పట్టే అంత స్థలం కూడా దేవుడు వారసత్వంగా ఇవ్వలేదు. కాని దేవుడు అబ్రాహాముకు ఒక్క సంతానం కూడా లేని సమయంలో అతని తర్వాత రాబోయే అతని సంతానం ఆ దేశాన్ని స్వాధీన పరచుకొంటారని అతనితో వాగ్దానం చేశారు. 6దేవుడు అతనితో ఇలా మాట్లాడారు: ‘నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు. 7కాని వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత ఆ దేశం నుండి వారు బయటకు వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు’#7:7 ఆది 15:13,14 అని దేవుడు చెప్పారు. 8అప్పుడు దేవుడు అబ్రాహాముకు సున్నతితో ఒక నిబంధనను ఇచ్చారు. కాబట్టి అతడు ఇస్సాకుకు తండ్రియైనప్పుడు నిబంధన ప్రకారం అతడు పుట్టిన ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇలా ఇస్సాకు యాకోబుకు తండ్రిగా యాకోబు పన్నెండు గోత్రాల పితరులను కన్న తండ్రిగా సున్నతి నిబంధనను పాటించారు.
9“మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఈజిప్టుకు బానిసగా అమ్మివేశారు. 10కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి, అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. ఆయన యోసేపుకు జ్ఞానం ఇచ్చి ఈజిప్టు రాజైన ఫరో దయ పొందుకొనేలా చేశారు. కాబట్టి ఫరో ఈజిప్టు దేశమంతటిమీద అలాగే అతని రాజభవనం మీద కూడా అతన్ని అధికారిగా నియమించాడు.
11“ఆ తర్వాత ఈజిప్టు కనాను దేశాల్లో తీవ్రమైన కరువు వచ్చి, ప్రజలందరికి చాలా కష్టాలు కలిగాయి, అప్పుడు మన పితరులకు కరువు వల్ల ఆహారం దొరకలేదు. 12యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు. 13వారు రెండవసారి వెళ్లినప్పుడు, యోసేపు తాను ఎవరో తన సహోదరులకు తెలియజేశాడు. అలాగే ఫరో యోసేపు కుటుంబం గురించి తెలుసుకున్నాడు. 14ఆ తర్వాత యోసేపు తన తండ్రియైన యాకోబును, తన కుటుంబమంతటిని పిలిపించాడు, వారు మొత్తం డెబ్బై అయిదు మంది వ్యక్తులు. 15అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు. 16వారి మృతదేహాలను షెకెము అనే ఊరికి తెచ్చి అబ్రాహాము షెకెములోని హామోరు కుమారుల దగ్గర వెల ఇచ్చి కొన్న అదే స్థలంలోని సమాధిలో ఉంచారు.
17“దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఈజిప్టులో ఉన్న మన ప్రజల సంఖ్య అతి విస్తారంగా పెరిగింది. 18కొంతకాలం తర్వాత యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు, ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.#7:18 నిర్గమ 1:8 19అతడు మన జాతి ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించి పుట్టిన తమ చంటి పిల్లలను చనిపోవడానికి పారవేయాలని మన పితరులను బలవంతం చేసి హింసించాడు.
20“ఇలాంటి రోజుల్లో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది. 21అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. 22మోషే ఈజిప్టువారి విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు.
23“మోషేకు నలభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు. 24అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఈజిప్టువాన్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. 25తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకుంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు. 26మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు.
27“అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? 28ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’#7:28 నిర్గమ 2:14 అన్నాడు. 29మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు.
30“నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు. 31అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా, 32‘నేను మీ పితరుల దేవుడను అనగా నేనే అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను’#7:32 నిర్గమ 3:6 అని ప్రభువు చెప్పడం అతడు విన్నాడు. కాబట్టి మోషే భయంతో వణుకుతూ దానిని చూడడానికి సాహసించలేకపోయాడు.
33“అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు. 34ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. నేను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కాబట్టి రా! నేను నిన్ను తిరిగి ఈజిప్టు దేశానికి పంపుతాను’#7:34 నిర్గమ 3:5,7,8,10 అన్నారు.
35“ ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?’ అని తిరస్కరించిన ఈ మోషేనే దేవుడు వారికి అధికారిగా విమోచకునిగా ఉండాలని మండుతున్న పొదలో ప్రత్యక్షమైన దేవదూత ద్వార పంపించారు. 36అతడు ఈజిప్టులో, ఎర్ర సముద్రం దగ్గర నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలను సూచకక్రియలను చేసి వారిని ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు.
37“ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు’#7:37 ద్వితీ 18:15 అని చెప్పాడు. 38అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండమీద తనతో మాట్లాడిన దూతతో మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు.
39“కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఈజిప్టు వైపుకు తిరిగారు. 40వారు అహరోనుతో, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’#7:40 నిర్గమ 32:1 అని అన్నారు. 41అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు. 42అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాల్లో:
“ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు
మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా?
43మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు
మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు,
రెఫాను అనే మీ దేవుని నక్షత్రాన్ని పూజించారు.
అందుకే నేను మిమ్మల్ని బబులోను అవతలికి బందీలుగా పంపిస్తాను’#7:43 ఆమోసు 5:25-27 అని వ్రాయబడి ఉంది.
44“దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది. 45ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది. 46దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు. 47కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.
48“అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు:
49“ ‘ఆకాశం నా సింహాసనం,
భూమి నా పాదపీఠం.
మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు?
అని దేవుడు అంటున్నారు
నా విశ్రాంతి స్థలం ఏది?
50వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’#7:50 యెషయా 66:1,2
51“మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. 52మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. 53దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు.
స్తెఫెనును రాళ్లతో కొట్టుట
54న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. 55కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు. 56అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు.
57అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, 58పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు.
59వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. 60తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 7: TSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.