YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 8

8
1సౌలు స్తెఫను చావును సమ్మతించాడు.
సంఘం హింసించబడుట మరియు చెదరిపోవుట
ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి విరోధంగా తీవ్రమైన హింస చెలరేగింది, కనుక అపొస్తలులు తప్ప మిగిలిన సంఘమంతా యూదయ మరియు సమరయ ప్రాంతాలకు చెదరిపోయింది. 2దైవభయం గల విశ్వాసులు స్తెఫనును సమాధి చేసి అతని కొరకు ఎంతో రోదించారు. 3అయితే సౌలు ఇంటింటికి వెళ్లి, పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకెళ్లి వారిని చెరసాలలో వేయిస్తూ, సంఘాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు.
సమరయలో ఫిలిప్పు
4చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని బోధించారు. 5ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్లి అక్కడ క్రీస్తు గురించి ప్రకటించాడు. 6జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసి, అతడు చెప్పిన మాటల మీద శ్రద్ధ పెట్టసాగారు. 7చాలామందిలో నుండి దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి, చాలామంది పక్షవాతం గలవారు కుంటివారు స్వస్థత పొందుకొన్నారు. 8కనుక ఆ పట్టణంలో గొప్ప ఆనందం కలిగింది.
మంత్రవిద్యను ప్రదర్శించు సీమోను
9కొంత కాలం నుండి ఆ పట్టణంలో మంత్రవిద్యను ప్రదర్శిస్తూ తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ సమరయ ప్రజలందరిని ఆశ్చర్యపరచే, సీమోను అనే పేరుగలవాడు ఉన్నాడు. 10అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు ప్రజలందరు, “దేవుని శక్తి అంటే ఇతడే” అని చెప్తూ అతని మాటలపై శ్రద్ధచూపారు. 11అతడు తన మంత్రవిద్యతో వారిని చాలా కాలం నుండి ఆశ్చర్యపరస్తున్నాడు కనుక వారు అతన్ని వెంబడించేవారు. 12అయితే దేవుని రాజ్యసువార్తను మరియు యేసు క్రీస్తు నామంను ప్రకటించినప్పుడు ఫిలిప్పును నమ్మిన స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొందుకొన్నారు. 13సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు ఫిలిప్పు వెళ్లిన ప్రతి చోటికి వెంబడిస్తూ, తాను చూసిన గొప్ప సూచక క్రియలు అద్బుతాలను బట్టి ఆశ్చర్యపడ్డాడు.
14సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని స్వీకరించారని విన్న యెరూషలేములోని అపొస్తలులు, పేతురు యోహానులను సమరయ ప్రాంతానికి పంపించారు. 15వారు అక్కడి చేరుకొని, నూతన విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించారు, 16ఎందుకంటే వారిలో ఎవ్వరూ పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు; వారు కేవలం ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం మాత్రమే పొందుకొన్నారు. 17పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకొన్నారు.
18అపొస్తలులు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసిన సీమోను, వారికి డబ్బును ఇస్తూ, 19“నేను చేతులుంచిన ప్రతివారు పరిశుద్ధాత్మను పొందుకొనేలా ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అని అడిగాడు.
20అందుకు పేతురు, “నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు కనుక నీ డబ్బు నీతో నశించును గాక! 21నీ హృదయం దేవుని ముందు యదార్థంగా లేదు, కనుక ఈ పరిచర్యలో నీకు భాగం లేదు. 22నీ హృదయంలో అలాంటి ఆలోచన కలిగినందుకు క్షమిస్తాడనే నిరీక్షణతో నీ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకో. 23ఎందుకంటే నీవు ఘోర దుష్టత్వంతో నిండి పాపంలో బంధించబడి ఉన్నావని నాకు కనిపిస్తోంది” అన్నాడు.
24అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కొరకు మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని జవాబిచ్చాడు.
25వారు దేవుని వాక్యాన్ని ప్రకటించి యేసు గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, పేతురు మరియు యోహానులు సమరయలోని అనేక గ్రామాలలో సువార్తను బోధిస్తూ యెరూషలేమునకు తిరిగి వెళ్లారు.
ఫిలిప్పు మరియు ఐతియొపీయుడు
26ఒక దేవదూత ఫిలిప్పుతో, “నీవు దక్షిణ దిశలో యెరూషలేము పట్టణం నుండి గాజాకు వెళ్లే ఎడారి మార్గంలో వెళ్లు” అని చెప్పాడు. 27అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఐతియొపీయుల రాణి అయిన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఐతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు, 28అతడు తన ఇంటికి తిరిగి వెళ్తూ తన రథంలో కూర్చుని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. 29అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథానికి దగ్గరగా వెళ్లు” అని చెప్పాడు.
30అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు.
31అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని పిలిచాడు.
32ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది:
“ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె
బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు
ఆయన తన నోటిని తెరవలేదు.
33తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు.
ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు?
ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.”#8:33 యెషయా 53:7,8
34ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేక ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. 35అందుకు ఫిలిప్పు ఆ లేఖనభాగం నుండి మొదలుపెట్టి యేసు మొదలుపెట్టి యేసు గురించి సువార్తను అతనికి బోధించాడు.
36వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్ళువున్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్ళున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకం ఏమిటి?” అని అడిగాడు. [37అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు.]#8:37 కొన్ని వ్రాతప్రతులలో ఈ వాక్యములు ఇక్కడ చేర్చబడలేదు 38అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్ళలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. 39వారు నీళ్ళలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకువెళ్ళాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని సంతోషిస్తూ తన దారిన వెళ్లిపోయాడు. 40అయితే, ఫిలిప్పు ఆజోతు పట్టణంలో కనబడిన తర్వాత, అక్కడ నుండి కైసరయ పట్టణానికి చేరే వరకు అతడు అన్ని పట్టణాలలో సువార్త ప్రకటిస్తూ వెళ్లాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for అపొస్తలుల కార్యములు 8