YouVersion Logo
Search Icon

నిర్గమ 15

15
మోషే మిర్యాములు పాట
1దాని తర్వాత మోషే ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు:
“నేను యెహోవాకు పాడతాను,
ఆయన ఉన్నతంగా హెచ్చింపబడ్డారు.
గుర్రాన్ని దాని రౌతును
ఆయన సముద్రంలో పడవేశారు.
2“యెహోవాయే నా బలము నా పాట#15:2 లేదా కాపాడేవాడు;
ఆయన నాకు రక్షణ అయ్యారు.
ఆయన నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తాను,
ఆయన నా తండ్రికి దేవుడు నేనాయనను మహిమపరుస్తాను.
3యెహోవా యుద్ధవీరుడు;
యెహోవా అని ఆయనకు పేరు.
4ఆయన ఫరో రథాలను అతని సైన్యాన్ని
సముద్రంలో ముంచివేసారు.
అతని అధిపతులలో ప్రముఖులు
ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5అగాధజలాలు వారిని కప్పివేశాయి.
రాయిలా వారు అడుగున మునిగిపోయారు.
6యెహోవా, మీ కుడిచేయి,
బలంలో మహిమగలది.
యెహోవా, మీ కుడిచేయి,
శత్రువును పడగొట్టింది.
7“మీకు వ్యతిరేకంగా లేచినవారిని
మీ మహిమాతిశయంతో అణచివేశారు.
మీరు మీ కోపాగ్నిని రగిలించారు
అది వారిని చెత్తలా దహించింది.
8మీ ముక్కు నుండి వచ్చిన ఊపిరివలన
నీళ్లు కుప్పగా నిలిచాయి.
ప్రవాహజలాలు గోడలా నిలబడ్డాయి;
అగాధజలాలు సముద్రం మధ్యలో గడ్డకట్టాయి.
9‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను.
దోపుడుసొమ్మును పంచుకుంటాను;
వాటివలన నా ఆశ తీర్చుకుంటాను.
నేను నా ఖడ్గాన్ని దూస్తాను
నా చేయి వారిని నాశనం చేస్తుంది’
అని శత్రువు అనుకున్నాడు.
10అయితే మీరు మీ శ్వాసను ఊదగా
సముద్రం వారిని కప్పేసింది.
వారు బలమైన జలాల క్రింద
సీసంలా మునిగిపోయారు.
11యెహోవా, దేవుళ్ళ మధ్యలో
మీవంటి వారెవరు?
పరిశుద్ధతలో ఘనమైనవారు
మహిమలో భీకరమైనవారు,
అద్భుతాలు చేసే
మీవంటి వారెవరు?
12“మీరు మీ కుడిచేయి చాపగా
భూమి మీ శత్రువులను మ్రింగివేసింది.
13మీరు విమోచించిన ప్రజలను
మారని మీ ప్రేమతో నడిపిస్తారు.
మీ బలంతో మీరు వారిని
మీ పరిశుద్ధాలయానికి నడిపిస్తారు.
14దేశాలు విని వణుకుతాయి;
ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది.
15ఎదోము పెద్దలు భయపడతారు,
మోయాబు నాయకులకు వణుకు పుడుతుంది.
కనాను ప్రజలు#15:15 లేదా పాలకులు భయంతో నీరైపోతారు;
16భయం దిగులు వారి మీద పడతాయి.
యెహోవా, మీ ప్రజలు దాటి వెళ్లేవరకు,
మీరు కొనిన#15:16 లేదా సృష్టించిన మీ ప్రజలు దాటి వెళ్లేవరకు
మీ బాహుబలము చేత
వారు రాతిలా కదలకుండా ఉంటారు.
17మీరు వారిని లోపలికి తెచ్చి
మీ స్వాస్థ్యమైన పర్వతం మీద
యెహోవా, మీరు నివసించడానికి నిర్మించుకున్న స్థలంలో,
ప్రభువా, మీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో నాటుతారు.
18“యెహోవా నిరంతరం
పరిపాలిస్తారు.”
19ఫరో గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు సముద్రంలోకి వచ్చినప్పుడు, యెహోవా వారి మీదికి సముద్రపు నీటిని రప్పించారు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచారు. 20అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు. 21మిర్యాము వారితో ఇలా పాడింది:
“యెహోవాకు పాడండి,
ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు.
గుర్రాన్ని దాని రౌతును
ఆయన సముద్రంలో విసిరిపడవేశారు.”
మారా ఎలీము నీళ్లు
22తర్వాత మోషే ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించగా వారు షూరు ఎడారిలోనికి వెళ్లి మూడు రోజులు దానిలో ప్రయాణం చేశారు. అక్కడ వారికి నీరు దొరకలేదు. 23అప్పుడు వారు మారాకు వచ్చారు. అయితే మారా నీళ్లు చేదుగా ఉండడంతో వారు ఆ నీటిని త్రాగలేకపోయారు. (అందువల్ల ఆ చోటికి మారా#15:23 మారా అంటే చేదు అనే పేరు వచ్చింది.) 24కాబట్టి ప్రజలు, “మేమేమి త్రాగాలి?” అని మోషే మీద సణిగారు.
25అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టు కొమ్మను చూపించారు. అతడు దానిని నీటిలో వేయగా ఆ నీరు తియ్యగా మారాయి.
అక్కడే యెహోవా వారికి ఒక శాసనాన్ని నియమించి వారిని పరీక్షించారు. 26ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.
27తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై తాటి చెట్లు ఉన్నాయి. వారు ఆ నీటి దగ్గరే బస చేశారు.

Currently Selected:

నిర్గమ 15: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in