YouVersion Logo
Search Icon

హెబ్రీయులకు 2

2
శ్రద్ధ వహించాలని హెచ్చరిక
1కనుక మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. 2ఎందుకంటే దేవదూతల ద్వారా చెప్పబడిన వర్తమానం స్థిరపరచబడింది కనుక, ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన శిక్షను పొందగా, 3మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది. 4సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు, వివిధరకాల అద్బుతాలు, తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వరాలను పంచిపెట్టడం ద్వారా దేవుడు కూడా వాటి గురించి సాక్ష్యమిచ్చారు.
సంపూర్ణ మానవునిగా యేసు
5మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు. 6అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు:
“నీవు జ్ఞాపకం చేసుకోవడానికి మానవాళి ఏపాటిది,
నీవు మనుష్యుని లక్ష్యపెట్టడానికి అతడు ఏపాటివాడు?
7నీవు వారిని దేవదూతల కంటే కొంచెం#2:7 కొంచెం కొంత కాలం వరకు తక్కువగా చేసావు;
నీవు వారికి మహిమ ఘనతలతో కిరీటాన్ని ధరింపచేసావు
8ప్రతిదీ వారి పాదాల క్రింద ఉంచావు,”#2:8 కీర్తన 8:4-6
ప్రతి దాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేనిని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిది లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు. 9కాని, యేసు కొంత కాలం వరకు దేవదూతల కంటే తక్కువ చేయబడి, దేవుని కృప వల్ల ప్రతి ఒక్కరి కొరకు మరణాన్ని రుచిచూసారు గనుక ఇప్పుడు మహిమ ప్రభావాలతో కిరీటం ధరించుకొని ఉన్నట్లు మనం ఆయనను చూస్తున్నాం.
10ఎవరి కొరకు, ఎవరి ద్వారా సమస్తం కలిగిందో ఆ దేవునికి, అనేకమంది కుమారులను కుమార్తెలను మహిమలో తీసుకురావడంలో, వారి రక్షణకు మార్గదర్శి అయిన వానిని శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయడం తగినదిగా ఉండింది. 11ప్రజలను పరిశుద్ధపరచే వానిది పరిశుద్ధపరచబడిన వారిది ఒక్కటే కుటుంబం. కనుక వారిని సహోదరీ సహోదరులని పిలువడానికి యేసు సిగ్గుపడలేదు. 12ఆయన ఇలా అన్నారు,
“నేను నీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను;
సంఘంలో నీ కీర్తిని నేను గానం చేస్తాను.”#2:12 కీర్తన 22:22
13అంతేకాక,
“నేను ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుతాను.”#2:13 యెషయా 8:17
అంతేకాక,
“ఇదిగో నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు,”#2:13 యెషయా 8:18
అని ఆయన చెప్తున్నారు.
14ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగివున్నవారు గనుక, తన మరణం ద్వారా మరణంపై అధికారం గలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి, 15మరణ భయంతో దాస్యంలో ఉంచబడినవారిని విడిపించడానికి, ఆయన కూడా మానవరూపంలో పాలుపంచుకున్నాడు. 16ఇది ఖచ్చితంగా అబ్రాహాము సంతానానికే గాని దేవదూతలకు సహాయం చేయడానికి కాదు. 17దేవుని సేవచేయడంలో కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి, ప్రజల పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన అన్ని విధాలుగా వారిలా సంపూర్ణ మానవునిగా చేయబడ్డారు. 18ఆయన మానవునిగా శోధించబడినప్పుడు బాధను అనుభవించారు గనుక శోధించబడుతున్న వారికి ఆయన సహాయం చేయగలరు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in