యిర్మీయా 48
48
మోయాబు గురించిన సందేశం
1మోయాబు గురించి:
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు:
“నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది.
కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది;
దాని కోట#48:1 లేదా స్వాధీనమైంది మిస్గబు పడగొట్టబడి అవమానించబడుతుంది.
2మోయాబును ఇకపై పొగడరు;
హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు:
‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’
మద్మేను#48:2 ఇది మోయాబీయుల పట్టణం పేరు; హెబ్రీలో మౌనం చేయబడుట ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు;
ఖడ్గం నిన్ను వెంటాడుతుంది.
3హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి,
అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.
4మోయాబు ధ్వంసమవుతుంది;
దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.#48:4 కొ.ప్ర.లలో ఆ విషయాన్ని సోయరుకు ప్రకటించండి
5వారు కొండపై నుండి లూహీతుకు,
ఏడుస్తూ వెళ్తున్నారు;
హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన
విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
6పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి;
ఎడారిలో పొదలా#48:6 లేదా అరోయేరు లా ఉండండి.
7మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి,
మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు,
అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు
బందీగా వెళ్తాడు.
8యెహోవా చెప్పారు కాబట్టి
నాశనం చేసేవాడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు,
ఒక్క పట్టణం తప్పించుకోదు.
లోయ పాడైపోతుంది,
పీఠభూమి నాశనమవుతుంది.
9మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే,
అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది;
నివసించేవారు లేక,
దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.
10“యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు!
రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!
11“మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది,
ఒక బాన నుండి మరొక బానలో పోయబడని,
అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది,
అది చెరలోకి వెళ్లలేదు.
కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది,
దాని సువాసన మారలేదు.”
12యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“రాబోయే రోజుల్లో నేను,
కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు,
వారు దాన్ని బయటకు కుమ్మరించి,
కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు.
13ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు
ఎలా సిగ్గుపడ్డారో
మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు.
14“ ‘మేము యోధులం,
యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?
15మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి;
దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,”
అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
16“మోయాబు పతనం సమీపించింది;
దాని విపత్తు త్వరగా వస్తుంది.
17దాని చుట్టూ నివసించేవారలారా,
దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి;
‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది,
కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.
18“దీబోను కుమార్తెలారా,
మీ కీర్తి నుండి క్రిందికి దిగి,
ఎండిపోయిన నేల మీద కూర్చుండి,
ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు
మీ మీదికి వస్తాడు
మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు.
19అరోయేరులో నివసించేవారలారా,
రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి.
పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని,
‘ఏమైంది?’ అని అడగండి.
20మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది.
రోదించండి, బిగ్గరగా ఏడవండి!
మోయాబు నాశనమైపోయిందని
అర్నోనులో ప్రకటించండి.
21పీఠభూమికి తీర్పు తీర్చబడింది
హోలోనుకు, యహజుకు, మెఫాతుకు,
22దీబోనుకు, నెబోకు, బేత్-దిబ్లాతయీము,
23కిర్యతాయిముకు, బేత్-గమూలుకు, బేత్-మెయోనుకు,
24కెరీయోతుకు, బొస్రాకు
దూరంగా దగ్గరగా ఉన్న మోయాబులోని అన్ని పట్టణాలకు శిక్ష విధించబడుతుంది.
25మోయాబు కొమ్ము#48:25 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది నరికివేయబడింది;
దాని బాహువు విరిగింది,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
26“ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి,
ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది.
మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది;
ఆమె హేళన చేయబడుతుంది.
27ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా?
ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా,
నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా
ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?
28మోయాబులో నివసించేవారలారా,
మీ పట్టణాలను విడిచిపెట్టి రాళ్ల మధ్య నివసించండి.
గుహ ముఖద్వారం దగ్గర
గూడు కట్టుకునే పావురంలా ఉండండి.
29“మోయాబు గర్వం గురించి
దానికి అహంకారం గురించి
దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం,
దాని హృదయ అతిశయం గురించి విన్నాము.
30దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు,
దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
31కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను,
మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను,
కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను.
32షిబ్మా ద్రాక్షలారా,
యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను.
మీ కొమ్మలు సముద్రం#48:32 బహుశ మృత సముద్రం కావచ్చు వరకు వ్యాపించాయి;
అవి యాజెరు వరకు వ్యాపించాయి.
నాశనం చేసేవాడు,
పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.
33మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి
ఆనందం, సంతోషం పోయాయి.
నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను;
ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు.
కేకలు వినిపించినప్పటికీ,
అవి ఆనందంతో వేసిన కేకలు కావు.
34“నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి
కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు,
సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు,
వారి కేకలు వినిపిస్తున్నాయి.
35క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో
తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని
నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
36“కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది;
అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది.
వారు సంపాదించిన సంపద పోయింది.
37ప్రతి తల గుండు చేయబడింది
ప్రతి గడ్డం కత్తిరించబడింది;
ప్రతి చేయి నరకబడింది
ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.
38మోయాబులో ఇళ్ల పైకప్పులన్నిటి మీద
బహిరంగ కూడళ్లలో
దుఃఖం తప్ప మరేమీ లేదు,
పనికిరాని కుండను పగలగొట్టినట్లు
నేను మోయాబును పగులగొట్టాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
39“అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో!
మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో!
మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి,
హేళనగా భయం పుట్టించేదిగా మారింది.”
40యెహోవా ఇలా అంటున్నారు:
“చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద
రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది.
41కెరీయోతు#48:41 లేదా పట్టణాలు స్వాధీనం చేసుకోబడుతుంది,
బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి.
ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు
ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.
42మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి
ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.
43మోయాబు ప్రజలారా,
భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
44“భయాందోళన నుండి పారిపోయేవాడు
గొయ్యిలో పడిపోతాడు,
గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు
ఉచ్చులో చిక్కుకుంటాడు;
నేను మోయాబు మీదికి
దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
45“పారిపోయినవారు హెష్బోను నీడలో
బలహీనులై నిలబడి ఉన్నారు,
హెష్బోను నుండి అగ్ని,
సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి.
అది మోయాబు నొసళ్లను,
అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.
46మోయాబూ, నీకు శ్రమ!
కెమోషు ప్రజలు నాశనమైపోయారు;
నీ కుమారులు బందీలుగా వెళ్లారు
నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు.
47“అయితే నేను రాబోయే రోజుల్లో
మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.
Currently Selected:
యిర్మీయా 48: TSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.