YouVersion Logo
Search Icon

యోహాను 11

11
లాజరు చనిపోవుట
1బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. 2మరియ అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరి, ఆమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది. 3కనుక అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు.
4యేసు అది విని, “ఈ అనారోగ్యం చావుకు దారి తీయదు. కానీ దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు. 5యేసు మార్తను ఆమె సహోదరి మరియను మరియు లాజరును ప్రేమించారు. 6లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా, తాను ఉన్నచోటే మరో రెండు రోజులు ఉన్నారు. 7ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు.
8అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు.
9అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు. 10అతడు రాత్రి వేళ నడిస్తే వెలుగు ఉండదు కనుక అతడు తడబడతాడు” అని చెప్పారు.
11యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత, ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, కనుక నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు.
12అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతున్నట్లయితే, కోలుకొంటాడు” అన్నారు. 13యేసు అతని చావును గురించి మాట్లాడారు, కాని వారు సహజ నిద్ర గురించి అనుకున్నారు.
14కనుక యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను, దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు.
16అప్పుడు దిదుమ అనబడిన తోమా, “ఆయనతోపాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు.
యేసే పునరుత్ధానం మరియు జీవం
17యేసు అక్కడ చేరుకొని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు. 18యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. 19చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు. 20మార్త యేసు వస్తున్నాడని విని, ఆమె ఆయనను కలుసుకోడానికి బయటకు వెళ్లింది, కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. 22ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది.
23యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు.
24అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది.
25యేసు, “పునరుత్థానం మరియు జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. 26బ్రతికి ఉండి, నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు.
27ఆమె, “అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28ఆమె ఈ మాట చెప్పిన తర్వాత, ఆమె వెనుకకు తిరిగి వెళ్లి ఎవరికి తెలియకుండా తన సహోదరియైన మరియను ప్రక్కకు పిలిచి, “బోధకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని చెప్పింది. 29మరియ అది విని, వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది. 30అప్పటికి యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు. 31మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు, ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం గమనించి, ఆమె విలపించడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి, ఆమె వెంట వెళ్లారు.
32మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి, ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది.
33ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ, 34“మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు.
అప్పుడు వారు “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు.
35యేసు ఏడ్చారు.
36అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు.
37అయితే వారిలో కొందరు, “గ్రుడ్డివాడి కళ్ళను తెరిచిన ఈయన, ఇతనికి చావు రాకుండా చేయలేక పోయాడా?” అన్నారు.
చనిపోయిన లాజరును యేసు జీవంతో లేపుట
38యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. 39యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు.
చనిపోయిన లాజరు సహోదరి అయిన మార్త, “కాని, ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, కనుక ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది.
40అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు.
41కనుక వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. 42నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు, అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు.
43యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. 44చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్ళు చేతులు నారవస్త్రంతో, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉన్నాయి.
అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు.
యేసును చంపటానికి ప్రయత్నాలు
45మరియను చూడటానికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు. 46అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు. 47అప్పుడు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు.
“మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్బుత క్రియలను చేస్తున్నాడు. 48మనం ఆయనను అలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. ఆ తర్వాత రోమీయులు వచ్చి మన పరిశుద్ధ మందిరస్థలాన్ని మరియు మన దేశ ప్రజలను కలిపి ఈ రెండింటిని స్వాధీనం చేసుకుంటారు” అన్నారు.
49అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు! 50ప్రజలందరు నశించిపోకుండా వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు.
51అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కొరకు చనిపోతాడని, 52మరియు ఆ దేశం కొరకు మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని, పిల్లలందరిని, ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు. 53కనుక ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు.
54కనుక యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు.
55యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు. 56వారు యేసు కొరకు వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావడం లేదా ఏమి?” అని చెప్పుకొంటున్నారు. 57మరియు యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియజేయాలని ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.

Currently Selected:

యోహాను 11: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in