YouVersion Logo
Search Icon

లూకా 4

4
అరణ్యంలో యేసును శోధించి ఓడిన సాతాను
1యేసు, పరిశుద్ధాత్మపూర్ణుడై, యోర్దానును విడిచి ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డారు, 2అక్కడ నలభై రోజులు ఆయన అపవాది చేత శోధించబడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఆ రోజులు పూర్తి అవుతుండగా ఆయనకు ఆకలివేసింది.
3అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు.
4అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’#4:4 ద్వితీ 8:3 అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
5తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకువెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటిని ఆయనకు చూపించాడు. 6అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. 7నీవు నన్ను ఆరాధిస్తే, ఇవన్నీ నీవే అవుతాయి” అన్నాడు.
8అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి#4:8ద్వితీ 6:13’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
9అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకొనివెళ్ళి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడి నుండి క్రిందికి దూకు. 10ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి
ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు;
11నీ పాదాలకు ఒక రాయి కూడా తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొంటారు,’ ”#4:11 కీర్తన 91:11-12
అని అన్నాడు.
12అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది”#4:12 ద్వితీ 6:16 అని అన్నారు.
13అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.
నజరేతు వద్ద యేసు తిరస్కారం
14యేసు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి గలిలయకు వెళ్లారు, అప్పుడు ఆయన గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 15ఆయన వారి సమాజమందిరాలలో బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆయనను కొనియాడారు.
16యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు. 17ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపు చుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది:
18“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించడానికి,
ఆయన నన్ను అభిషేకించారు;
చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి,
గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి,
బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,
19ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.”#4:19 యెషయా 61:1,2; యెషయా 58:6
20ఆ తర్వాత ఆ గ్రంథపు చుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు. 21అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు.
22అందరు ఆయనను మెచ్చుకొంటూ ఆయన నోటి నుండి వచ్చే దయ గల మాటలకు ఆశ్చర్యపడి, “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అని వారు అడిగారు.
23యేసు వారితో మాట్లాడుతూ, “ ‘ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో!’ అనే సామెతను తప్పకుండా నాకు చెప్తారు, ఇంకా నాతో, ‘నీవు కపెర్నహూములో కార్యాలను చేసావని మేము విన్నట్లుగా, నీ సొంత గ్రామమైన ఇక్కడ కూడా చేయి’ అని మీరు అంటారు” అని అన్నారు.
24ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను. 25ఏలీయా ప్రవక్త రోజుల్లో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి, దేశమంతట తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. 26అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు. 27మరియు ఎలీషా అనే ఇంకొక ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠురోగులు ఉన్నా, సిరియా దేశపు నయమాను తప్ప మరి ఎవరు శుద్ధి పొందలేదు” అని చెప్పారు.
28ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోపపడ్డారు. 29వారు లేచి, ఆయనను పట్టణం నుండి బయటకు తరుముతూ, ఆ పట్టణం కట్టబడివున్న కొండ అంచు మీదకు తీసుకొనివెళ్ళి అక్కడి నుండి క్రిందికి పడద్రోయాలనుకొన్నారు. 30కానీ ఆయన జనసమూహం మధ్య నుండి నడుచుకుంటూ తన దారిన వెళ్లిపోయారు.
ఒక అపవిత్రాత్మను వెళ్లగొట్టే యేసు
31ఆ తర్వాత ఆయన గలిలయలోని కపెర్నహూముకు వెళ్లారు, మరియు సబ్బాతు దినాన ప్రజలకు బోధించారు. 32ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన మాటల్లో అధికారం ఉండింది.
33ఆ సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఉన్నాడు. 34“నజరేతువాడా, యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు దేవుని పరిశుద్ధుడవు అని నాకు తెలుసు!” అని వాడు బిగ్గరగా కేకలు వేసాడు.
35అందుకు యేసు, “మౌనంగా ఉండు!” అని కఠినంగా అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ దయ్యం వానికి ఏ గాయం చేయకుండ వారందరి ముందు వానిని పడవేసి బయటకు వచ్చేసింది.
36ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఏంటి ఆ మాటలు! అధికారంతో శక్తితో ఈయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే, అవి బయటకు వచ్చేస్తున్నాయి!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 37ఇలా ఆయనను గురించిన వార్త చుట్టు ప్రక్కలోని ప్రాంతమంతా వ్యాపించింది.
అనేకులను బాగుచేసిన యేసు
38యేసు సమాజమందిరం నుండి బయటకు వచ్చి సీమోను ఇంటికి వెళ్లారు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది, కనుక వారు ఆమెకు సహాయం చేయమని యేసును అడిగారు. 39కనుక ఆయన ఆమె వైపుకు వంగి జ్వరాన్ని గద్దించారు, జ్వరం ఆమెను వదలిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచారం చేయడం మొదలు పెట్టింది.
40సూర్యుడు అస్తమించినప్పుడు, ప్రజలు వివిధ రోగాలు గలవారినందరిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతులుంచి, వారిని స్వస్థపరిచారు. 41అంతేకాక, చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేస్తూ బయటికి వచ్చాయి! కాని తాను క్రీస్తు అని వాటికి తెలుసు, కనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
42మరుసటిరోజు తెల్లవారగానే, యేసు ఏకాంత స్థలానికి వెళ్లారు. ప్రజలు ఆయనను వెదకుతూ ఆయన ఉన్నచోటుకు వచ్చి, ఆయనను వెళ్లిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు. 43కానీ ఆయన వారితో, “నేను ఇతర గ్రామాలలో కూడా దేవుని రాజ్యసువార్తను ప్రకటించాలి, అందుకొరకే నేను పంపబడ్డాను” అని వారితో చెప్పారు. 44మరియు ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాలలో ప్రకటిస్తూ ఉన్నారు.

Currently Selected:

లూకా 4: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in