YouVersion Logo
Search Icon

మత్తయి 27

27
ఉరి వేసుకొనిన యూదా
1తెల్లవారుజామున ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి యేసును ఎలా చంపాలి అని ఆలోచన చేశారు. 2కనుక వారు ఆయనను బంధించి, తీసుకువెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.
3అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు మరియు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు. 4అతడు వారితో, “నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను” అని అన్నాడు.
అందుకు వారు, “దానితో మాకేంటి? అది నీ సమస్య” అని జవాబిచ్చారు.
5అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడి నుండి వెళ్లి, ఉరి వేసుకొన్నాడు.
6ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసికొని, “ఇవి రక్తపు వెల కనుక వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పి, 7వారు ఆలోచించి ఆ డబ్బుతో విదేశీయులను సమాధి చేయడానికి ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు. 8అందుకే నేటి వరకు ఆ పొలం రక్తపొలం అని పిలువబడుతూ ఉంది. 9-10ఈ విధంగా యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన: “వారు ముప్పై వెండి నాణెములు తీసుకొన్నారు, అవి ఇశ్రాయేలీయులు ఆయనకు కట్టిన విలువ, ప్రభువు నన్ను ఆదేశించిన ప్రకారం, వారు ఆ డబ్బుతో కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు”#27:9-10 జెకర్యా 11:12; యిర్మీయా 19:1-13; 32:6-9 అనే ప్రవచనం నెరవేరింది.
పిలాతు ముందు యేసు
11తర్వాత యేసు పిలాతు అధిపతి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అధిపతి, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు.
అందుకు యేసు, “అని నీవే అన్నావు కదా” అని జవాబిచ్చారు.
12ముఖ్య యాజకులు మరియు యూదానాయకులును యేసు మీద నిందలు మోపినప్పుడు, ఆయన వాటికి జవాబివ్వలేదు. 13అందుకు పిలాతు, “వారు నీకు వ్యతిరేకంగా తెస్తున్న సాక్ష్యాన్ని నీవు వినడం లేదా?” అని అడిగాడు. 14కాని కనీసం ఒకదానికైనా యేసు జవాబివ్వలేదు, అధిపతికి చాలా ఆశ్చర్యం కలిగింది.
15పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి. 16ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు. 17కనుక జనసమూహం సమకూడినప్పుడు, పిలాతు, “నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? యేసు అనబడిన బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా?” అని వారిని అడిగాడు. 18ఎందుకంటే వారు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని అతడు గ్రహించాడు.
19పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య అతనికి: “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు, రాత్రి కలలో ఆయన గురించి నేను చాలా కష్టపడ్డాను” అని వర్తమానం పంపింది.
20కాని ముఖ్య యాజకులు మరియు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు.
21అధిపతి, “ఈ ఇద్దరిలో నేను ఎవనిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని వారిని అడిగాడు.
వారు “బరబ్బనే” అని కేకలు వేశారు.
22అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు.
అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
23“ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు.
అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
24పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసికొని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కొని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు.
25అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.
26అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
యేసును అపహసించిన సైనికులు
27అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనంలోనికి తీసికొని వెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. 28వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు. 29ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఆయనను ఎగతాళి చేశారు. 30వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసికొని దానితో ఆయనను తల మీద పదే పదే కొట్టారు. 31వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళ్లారు.
సిలువ మ్రానుపై యేసు
32వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు. 33వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకొని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం. 34అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచిచూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు. 35వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి వారు ఆయన బట్టలను పంచుకున్నారు. 36వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు. 37ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు:
ఇతడు యేసు, యూదుల రాజు.
38ఆయనతోపాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున ఒకడిని సిలువ వేశారు. 39ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, 40“దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలలో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అంటూ ఆయనను దూషించారు. 41అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, 42“వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగి వస్తే, మేము ఇతన్ని నమ్ముతాము. 43వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు. 44ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
యేసు మరణం
45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. 46ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు “నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు?”#27:46 కీర్తన 22:1 అని అర్థం.
47అక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని, “ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
48వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని వెళ్లి ఒక స్పంజీని తెచ్చాడు. దాన్ని ఆ చేదు చిరకలో ముంచి, కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. 49మిగిలిన వారు, “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదలి వేద్దాం. ఏలీయా వచ్చి వీన్ని రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.
50యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.
51ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి. 53యేసు లేచిన తర్వాత వారు సమాధులలో నుండి బయటికి వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలా మందికి కనిపించారు.
54శతాధిపతి మరియు అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని మరియు జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు.
55అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దూరంగా నిలబడి చూస్తున్నారు. వారు యేసుకు సపర్యలు చేస్తూ గలిలయ నుండి ఆయనను వెంబడించారు. 56వారిలో మగ్దలేనే మరియ, యాకోబు మరియు యోసేపుల తల్లియైన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
యేసు యొక్క భూస్థాపన
57సాయంకాలం అవుతున్నప్పుడు, తనకు తానే యేసు శిష్యునిగా మారిన, అరిమతయికు చెందిన యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు. 58అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు, అందుకు పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆదేశించాడు. 59యోసేపు ఆ దేహాన్ని తీసుకొని, శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. 60తన కొరకు రాతిలో తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో దానిని పెట్టాడు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు. 61మగ్దలేనే మరియ మరియు వేరొక మరియ అక్కడే ఆ సమాధి ఎదుట కూర్చుని ఉన్నారు.
యేసు సమాధికి కాపలా
62మరుసటిరోజు, అనగా సిద్ధపరచే దినానికి తర్వాత రోజు, ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వెళ్లారు. 63వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది. 64కనుక మూడవ దినము వరకు సమాధిని భద్రం చేయడానికి ఆదేశించండి. లేకపోతే, అతని శిష్యులు వచ్చి వాని శరీరాన్ని ఎత్తుకొనిపోయి, అతడు మృతులలో నుండి లేచాడని ప్రజలతో చెప్పవచ్చు. అప్పుడు మొదటి మోసం కంటే కడపటి మోసం మరి విపరీతంగా ఉంటుంది” అని చెప్పారు.
65అందుకు పిలాతు, “కాపలా వాన్ని తీసుకోండి, మీరు వెళ్లి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి” అని వారితో చెప్పాడు. 66కనుక వారు వెళ్లి కాపలా వారిని ఏర్పాటు చేసి రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు.

Currently Selected:

మత్తయి 27: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in