YouVersion Logo
Search Icon

మార్కు సువార్త 1

1
మార్గాన్ని సిద్ధపరుస్తున్న బాప్తిస్మమిచ్చే యోహాను
1దేవుని కుమారుడైన క్రీస్తు#1:1 క్రీస్తు అంటే అభిషిక్తుడు యేసును గురించిన సువార్త ప్రారంభం. 2యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లుగా:
“ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను,
అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.”#1:2 మలాకీ 3:1
3“అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం,
‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి,
ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ ”#1:3 యెషయా 40:3 అని చెప్తుంది.
4అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ప్రత్యక్షమై, పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు. 5యూదయ గ్రామీణ ప్రాంతమంతా, యెరూషలేము ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. 6యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించి, నడుముకు తోలుదట్టీ కట్టుకునేవాడు. అతడు మిడతలు అడవి తేనె తినేవాడు. 7ఆయన ఇచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. 8నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.”
యేసు బాప్తిస్మం శోధన
9ఆ సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందారు. 10యేసు నీటిలో నుండి బయటకు వస్తుండగా, ఆకాశం చీలి దేవుని ఆత్మ పావురంలాగ ఆయన మీదికి దిగి రావడం అతడు చూశాడు. 11అంతేకాక పరలోకం నుండి ఒక స్వరం: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.
12వెంటనే ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు, 13ఆయన సాతానుచేత శోధించబడుతూ, నలభై రోజులు అరణ్యంలో ఉన్నారు. అడవి మృగాల మధ్య ఆయన ఉన్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
యేసు సువార్తను ప్రకటించుట
14యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, యేసు దేవుని సువార్తను ప్రకటిస్తూ, గలిలయకు వెళ్లారు. 15ఆయన, “కాలము పూర్తయింది. దేవుని రాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి!” అని చెప్పారు.
మొదటి శిష్యులను పిలుచుకున్న యేసు
16యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, సీమోను అతని సోదరుడు అంద్రెయ సముద్రంలో వల వేయడం ఆయన చూశారు, వారు జాలరులు. 17యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. 18వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
19ఆయన ఇంకా కొంత దూరం వెళ్లినప్పుడు, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను పడవలో ఉండి, తమ వలలను సిద్ధం చేసుకోవడం ఆయన చూశారు 20వెంటనే ఆయన వారిని పిలిచారు, వారు ఆలస్యం చేయకుండ తమ తండ్రియైన జెబెదయిని పనివారితో పాటు పడవలో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
అపవిత్రాత్మను వెళ్లగొట్టిన యేసు
21వారు కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. 22ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు. 23అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు, 24“నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేశాడు.
25అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. 26అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది.
27ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 28ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది.
అనేకమందిని స్వస్థపరచిన యేసు
29వారు సమాజమందిరం నుండి బయటకు రాగానే, వారు యాకోబు యోహానుతో కలిసి అంద్రెయ, సీమోనుల ఇంటికి వెళ్లారు. 30సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. 31కాబట్టి ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చేయి పట్టుకుని లేవనెత్తారు. జ్వరం ఆమెను వదిలిపోయింది అప్పుడు ఆమె వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది.
32సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగాలు గలవారినందరిని దయ్యాలు పట్టినవారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. 33పట్టణస్థులందరు ఆ ఇంటి ద్వారం దగ్గర కూడుకున్నారు, 34వివిధ రోగాలు గల అనేకులను యేసు స్వస్థపరిచారు. ఆయన అనేక దయ్యాలను వెళ్లగొట్టారు, అయితే ఆ దయ్యాలకు తాను ఎవరో తెలుసు, కాబట్టి ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
ఏకాంత స్థలంలో యేసు ప్రార్థన
35చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు. 36సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి, 37ఆయనను కనుగొని, “అందరు నీకోసం వెదకుతున్నారు!” అని చెప్పారు.
38అందుకు యేసు, “మనం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్దాం రండి, అప్పుడు నేను అక్కడ కూడా ప్రకటించగలను, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అని వారితో చెప్పారు. 39కాబట్టి ఆయన గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ ఉన్నారు.
కుష్ఠువ్యాధి గలవాన్ని బాగుచేసిన యేసు
40కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్లమీద ఉండి, “నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు.
41యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. 42వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది, వాడు బాగయ్యాడు.
43-44వెంటనే యేసు: “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకుని వారికి సాక్ష్యంగా ఉండేలా నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని హెచ్చరించి వాన్ని పంపివేశారు. 45కాని వాడు వెళ్లి ఈ విషయాన్ని అందరితో చెప్తూ, ఆ వార్తను ప్రచురం చేశాడు. దాని ఫలితంగా యేసు ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక ఎవరు నివసించని బయట ప్రదేశాల్లో ఉన్నారు. అయినాసరే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వస్తూనే ఉన్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in