YouVersion Logo
Search Icon

మార్కు 13

13
దేవాలయ ధ్వంసము మరియు అంత్యకాల సూచనలు
1యేసు దేవాలయం నుండి వెళ్తుండగా, ఆయన శిష్యులలో ఒకడు, “బోధకుడా, చూడండి! ఈ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో! ఈ కట్టడాలు ఎంత అద్బుతంగా ఉన్నాయో!” అని ఆయనతో అన్నాడు.
2అందుకు యేసు “నీవు ఈ గొప్ప కట్టడాలన్నిటిని చూస్తున్నావా? ఇందులో ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది” అని చెప్పారు.
3-4యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు, పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయలు ఏకాంతంగా ఉన్నప్పుడు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరబడబోతున్నాయి అనడానికి సూచన ఏంటి? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు.
5అందుకు యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా చూసుకోండి. 6ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. 7మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినినప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగవలసివుంది, కాని అంతం రావలసి ఉంది. 8జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.
9“మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. నన్ను బట్టి మీరు అధికారుల యెదుట రాజుల యెదుట వారికి సాక్షులుగా నిలబడతారు. 10ఈ సువార్త మొదట అన్ని దేశాల ప్రజలకు ప్రకటించబడాలి. 11మీరు బంధించబడి తీర్పుకు అప్పగించబడినప్పుడు ఏమి చెప్పాలో అని మీరు ముందుగానే చింతించవద్దు. ఆ సమయంలో మీకు ఇవ్వబడిన మాటలనే చెప్పండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ మీ ద్వారా మాట్లాడతాడు.
12“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. 13నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు, కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.
14“ ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’#13:14 దాని 9:27; 11:31; 12:11 నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, చదివేవాడు అర్థం చేసుకొనును గాక, అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. 15ఇంటిపైన ఉన్న వారెవరు కిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేనిని బయటకు తీసుకురాకూడదు. 16పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి వెనక్కి వెళ్లకూడదు. 17ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! 18ఇది చలికాలంలో రాకుండా ప్రార్థించండి. 19ఎందుకంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమకాలాలు రాలేదు, మరి ఎప్పటికి రావు.
20“ప్రభువు ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని ఎన్నుకోబడినవారి కొరకు, అనగా ఆయన ఎన్నికలో ఉన్న వారి కొరకు ఆ రోజులు తగ్గించబడతాయి. 21ఆ రోజుల్లో మీతో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఇదిగో, ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే నమ్మకండి. 22ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు. 23కనుక మీరు జాగ్రత్తగా ఉండండి; అందుకే ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను.
24“కాని ఆ దినాలలో, ఆ శ్రమకాలం తర్వాత,
“ ‘సూర్యుడు నల్లగా మారుతాడు,
చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.
25నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి,
ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి.’#13:25 యెషయా 13:10; 34:4
26“అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో మరియు మహిమతో మేఘాలలో రావడం ప్రజలు చూస్తారు. 27ఆయన తన దూతలను పంపి, నలుదిక్కుల నుండి, భూమి చివర్ల నుండి ఆకాశాల చివర్ల వరకు ఆయన ఎన్నుకొన్న వారిని పోగుచేస్తారు.
28“అంజూరపు చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూరపు కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు, వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది. 29అలాగే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ చాలా దగ్గరలో ఉందని, తలుపు దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి. 30ఇవన్ని జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. 31ఆకాశం మరియు భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏ మాత్రం గతించవు.
ఆ దినము గాని ఆ సమయం గాని ఎవరికీ తెలియదు
32“అయితే ఆ దినము గురించి, ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. 33జాగ్రత్తగా ఉండండి! మెలకువగా ఉండండి! ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. 34అది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్తున్న ఒక మనిషిని పోలి ఉంది: అతడు సేవకులకు అధికారం ఇచ్చి, ప్రతీ సేవకునికి వారి వారి పనులను అప్పగించి, ద్వారం దగ్గర ఉన్న వానికి కాపలా కాయమని చెప్తాడు.
35“ఇంటి యజమాని సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, లేక సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. 36అతడు ఒకవేళ అకస్మాత్తుగా వస్తే, మీరు నిద్రపోవడం చూస్తాడేమో అని జాగ్రత్తగా ఉండండి! 37నేను మీతో చెప్తుందే ప్రతి ఒక్కరితో చెప్తున్నాను: ‘మెలకువగా ఉండండి!’ ” అన్నారు.

Currently Selected:

మార్కు 13: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in