YouVersion Logo
Search Icon

కీర్తనలు 89

89
కీర్తన 89
ఎజ్రాహీయుడైన ఏతాను ధ్యానకీర్తన.
1యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను;
నా నోటితో మీ నమ్మకత్వాన్ని
అన్ని తరాలకు తెలియజేస్తాను.
2మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని,
మీ నమ్మకత్వాన్ని మీరు పరలోకంలోనే స్థాపించారని నేను ప్రకటిస్తాను.
3“నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను,
నా సేవకుడైన దావీదుకు ప్రమాణం చేశాను.
4‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను
మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. సెలా
5యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి,
అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది.
6అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు?
దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు?
7పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు;
తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన అధిక గౌరవనీయుడు.
8సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు?
యెహోవా మీరు మహా బలాఢ్యులు,
మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.
9పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు;
అలలను మీరు అణచివేస్తారు.
10చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును#89:10 కీర్తన 74:13 చూడండి. నలగ్గొట్టారు;
మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది.
11ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే;
లోకాన్ని దానిలో ఉన్నదంతా మీరే స్థాపించారు.
12ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు;
తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి.
13మీ బాహువు శక్తి కలది;
మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది.
14నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు;
మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి.
15యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు,
మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు.
16రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు;
మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు.
17ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే,
మీ దయతో మా కొమ్మును#89:17 కొమ్ము ఇక్కడ బలానికి సూచిస్తుంది హెచ్చిస్తారు.
18నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది,
మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.
19ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ,
మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు:
“నేను వీరుడికి సాయం చేశాను.
ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను.
20నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను;
నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.
21అతనికి నా చేయి తోడుగా ఉంది;
నా బాహువు అతన్ని బలపరుస్తుంది.
22శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు;
దుష్టులు అతన్ని అణచివేయలేరు.
23అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను,
అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను.
24నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి,
నా నామాన్ని బట్టి అతని కొమ్ము#89:24 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది హెచ్చంపబడుతుంది.
25నేను అతని చేతిని సముద్రం మీద,
అతని కుడి హస్తాన్ని నదుల మీద ఉంచుతాను.
26‘మీరు నా తండ్రి, నా దేవుడు
నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు.
27అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను,
భూరాజులందరిలో అతన్ని మహా ఉన్నతమైనవానిగా చేస్తాను.
28నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను,
అతనితో నా నిబంధన స్థిరమైనది.
29అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను,
అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది.
30“అతని కుమారులు నా న్యాయవిధుల నుండి తొలగిపోయినా
నా చట్టాలను పాటించకపోయినా
31ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా
నా ఆజ్ఞలను గైకొనకపోయినా,
32నేను వారి పాపాన్ని దండంతో,
వారి దోషాన్ని దెబ్బలతోను శిక్షిస్తాను;
33అయితే వారికి నా ప్రేమను పూర్తిగా దూరం చేయను,
నా నమ్మకత్వాన్ని ఎన్నటికి విడిచిపెట్టను.
34నా నిబంధనను నేను భంగం కానివ్వను.
నేను చెప్పినదానిలో ఒక మాట కూడా తప్పిపోదు.
35నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను,
నేను దావీదుతో అబద్ధం చెప్పను.
36అతని వంశం నిత్యం ఉంటుందని,
సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం నా ఎదుట ఉంటుందని;
37ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా,
అది శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటుంది” అని అన్నాను. సెలా
38కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు,
మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు.
39మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి,
అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు.
40మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు
అతని బలమైన కోటలను పాడుచేశారు.
41దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు;
అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు.
42మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు;
అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు.
43నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు
యుద్ధంలో అతనికి సాయం చేయలేదు.
44మీరు అతని వైభవాన్ని అంతం చేశారు
అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.
45అతని యవ్వన దినాలను తగ్గించారు;
అవమానంతో అతన్ని కప్పారు. సెలా
46ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా?
ఎంతకాలం మీ ఉగ్రత అగ్నిలా మండుతూ ఉంటుంది?
47నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి,
వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!
48మరణం చూడకుండ ఎవరు బ్రతకగలరు?
సమాధి బలం నుండి మనిషిని ఎవరు రక్షించగలరు? సెలా
49ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి
మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ?
50ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో,
అన్ని దేశాల నిందలను నేను నా హృదయంలో ఎలా భరిస్తున్నానో
51యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు,
అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి.
52యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక!
ఆమేన్ ఆమేన్.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in