YouVersion Logo
Search Icon

ప్రకటన 11

11
ఇద్దరు సాక్షులు
1అప్పుడు ఒక దేవదూత నా చేతికి కొలిచే కర్రను ఇచ్చి నాతో, “లేచి, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలిచి ఆరాధిస్తున్నవారి సంఖ్యను లెక్కించు. 2అయితే ఆలయం బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అణగద్రొక్కుతారు. 31,260 రోజులు గోనెపట్ట కట్టుకొని ప్రవచించడానికి నా ఇద్దరు సాక్షులను నేను నియమిస్తున్నాను” అని చెప్పాడు. 4వారు “రెండు ఒలీవచెట్లు” రెండు దీపస్తంభాలుగా ఉన్నారు; “వారు భూలోకానికి ప్రభువైనవాని ఎదుట నిలబడి ఉన్నారు.”#11:4 జెకర్యా 4:3,11,14 5ఎవరైనా వారికి హాని చేయాలని ప్రయత్నిస్తే, వారి నోటి నుండి అగ్ని వచ్చి వారి శత్రువులను దహించి వేస్తుంది. కాబట్టి వీరికి హాని చేయాలనుకునేవారు ఇలా చావాల్సిందే. 6వారు ప్రవచించే రోజుల్లో భూమి మీద వాన కురవకుండా ఆకాశాన్ని మూయగలిగే అధికారం వారికి ఉంది. అలాగే వారికి కావలసినప్పుడెల్లా నీటిని రక్తంగా మార్చి, అన్ని రకాల వ్యాధులతో భూమిని బాధించడానికి అధికారం వారికి ఉంది.
7ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యం ఇవ్వడం పూర్తి చేసిన తర్వాత, అగాధం నుండి ఒక మృగం వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి చంపుతుంది. 8వారి మృతదేహాలు ఆ గొప్ప పట్టణపు వీధిలో పడి ఉంటాయి. ఆ పట్టణం ఉపమానరీతిలో సొదొమ అని, ఈజిప్టు అని పిలువబడుతుంది. వారి ప్రభువు కూడా సిలువ వేయబడింది అక్కడే. 9మూడున్నర రోజుల వరకు ప్రజల్లో అన్ని గోత్రాల వారు, అన్ని భాషల వారు, అన్ని జాతులవారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు. 10ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీద జీవించేవారిని వేధించారు కాబట్టి భూనివాసులందరు వారి చావును బట్టి సంతోష సంబరాలు జరుపుకొంటూ ఒకరికొకరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకొంటారు.
11కానీ మూడున్నర రోజుల తర్వాత దేవుని నుండి జీవవాయువు#11:11 యెహె 37:5,14 వారిలోనికి ప్రవేశించి వారు తమ కాళ్లమీద లేచి నిలబడినప్పుడు వారిని చూసిన వారందరికి విపరీతమైన భయం కలిగింది. 12అప్పుడు పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వారితో, “ఇక్కడకు ఎక్కి రండి!” అని చెప్పడం ఆ సాక్షులు విన్నారు. అప్పుడు వారి శత్రువులు వారిని చూస్తూ ఉండగానే వారు ఒక మేఘం మీద పరలోకానికి ఎక్కి వెళ్లిపోయారు.
13సరిగ్గా అదే గంటలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణంలో పదవ భాగం కూలిపోయింది. ఏడు వేలమంది ప్రజలు చనిపోయారు, అయితే మిగిలిన వారికి భయం కలిగి పరలోకం నుండి పరిపాలిస్తున్న దేవుని మహిమపరిచారు.
14రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ అతిత్వరలో రానుంది.
ఏడవ బూర
15ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది,
“భూలోక రాజ్యం
ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి
కాబట్టి ఆయన ఎల్లకాలం పరిపాలిస్తారు.”
16అప్పుడు, దేవుని సన్నిధిలో తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవైనలుగురు పెద్దలు సాగిలపడి ఇలా దేవుని ఆరాధించారు,
17“గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడవైన
సర్వశక్తిగల ప్రభువైన దేవా,
నీ మహాశక్తిని బట్టి నీవు పరిపాలిస్తున్నావు,
కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.
18దేశాలు కోప్పడినందుకు
నీ ఉగ్రత వచ్చింది.
ఇక చచ్చినవారికి తీర్పు తీర్చడానికి,
సేవకులైన ప్రవక్తలకు, నీ పేరుకు భయపడే నీ ప్రజలకు
సామాన్యుల నుండి గొప్పవారి వరకు
ప్రతిఫలాన్ని ఇవ్వడానికి,
భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయడానికి సమయం వచ్చింది.”
19అప్పుడు పరలోకంలోని దేవాలయం తెరచుకొంది, దేవుని నిబంధన మందసం ఆయన దేవాలయంలో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, తీవ్రమైన వడగండ్ల వాన వచ్చాయి.

Currently Selected:

ప్రకటన 11: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ప్రకటన 11