ప్రకటన 15
15
ఏడుగురు దేవదూతలు, ఏడు తెగుళ్ళు
1నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది. 2నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూశాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, దాని విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు. 3వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ,
“మా ప్రభువైన సర్వశక్తిగల దేవా!
నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి!
సకల రాజ్యాలకు#15:3 కొ.ప్ర.లలో యుగములకు రాజా!
నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి!
4ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు,
కాబట్టి నీకు భయపడని వారు ఎవరు?
నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు?
నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి,
కాబట్టి భూజనులందరు
నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,”#15:4 కీర్తన 111:2,3; ద్వితీ 32:4; యిర్మీయా 10:7; కీర్తన 86:9; కీర్తన 98:2 అని దేవుని స్తుతించారు.
5దీని తర్వాత నేను చూస్తూ ఉండగా, పరలోక దేవాలయం అనగా సాక్షి గుడారం తెరవబడింది. 6ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని ఉన్నారు. 7అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు. 8అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.
Currently Selected:
ప్రకటన 15: TSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.