ప్రకటన 8
8
ఏడవ ముద్ర, ధూపం వేసే బంగారు పాత్ర
1ఆ వధించబడిన గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది.
2అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి.
3ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకున్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి చాలా ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి. 4అప్పుడు దూత చేతి నుండి ఆ ధూపద్రవ్యాల పొగ దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిసి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. 5ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి.
ఏడు బూరలు
6అప్పుడు ఏడు బూరలను పట్టుకుని ఉన్న ఆ ఏడు దూతలు వాటిని ఊదడానికి సిద్ధపడ్డారు.
7మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం కాలిపోయింది, పచ్చని గడ్డంతా కాలిపోయింది.
8రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడింది. అప్పుడు సముద్రంలోని మూడవ భాగం రక్తంగా మారింది. 9దానితో సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చనిపోయాయి. ఇంకా ఓడలలో మూడవ భాగం నాశనమయ్యాయి.
10మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది. 11ఆ నక్షత్రం పేరు “చేదు”#8:11 చేదు మాచిపత్రి అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు.
12నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.
13నేను చూస్తూ ఉండగా ఒక పక్షిరాజు మధ్య ఆకాశంలో ఎగురుతూ పెద్ద స్వరంతో, “అయ్యో, శ్రమ! శ్రమ! మిగతా ముగ్గురు దేవదూతలు బూరల ధ్వని చేయబోతున్నారు కాబట్టి భూనివాసులకు శ్రమ” అని అరుస్తుంటే నేను విన్నాను.
Currently Selected:
ప్రకటన 8: TSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.